విష సర్పాలతో భద్రం

అధైర్య పడితే ప్రాణాలకే ప్రమాదం
– పరిసరాల శుభ్రతతోనే విష సర్పాలు దూరం
– నాటు వైద్యం వద్దు..నేటి వైద్యమే రక్ష
– అన్ని సర్పాలు విషపూరితము కావు
– ప్రజలకు అందుబాటులో మందులు
– వర్షాకాలంలో ఎంతో అప్రమత్తత అవసరం
వర్షాకాలం ప్రారంభమై వర్షాలు సమద్ధిగా కురుస్తుండటంతో రైతులు పొలం పనుల్లో బీజీగా ఉంటారు. మరో వైపు ఇది పాములకు అనువైన కాలం. జూలై,ఆగస్టు నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా పొలం పనులకు వెళ్లే రైతులు, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. సాధారణంగా విషసర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటు వేసిన పాము విష పూర్తిమైందో కాదో ముందు తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట కట్టుకట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఎలాంటి పాము కాటు వేసినా వెంటనే ఆస్పత్రికి తీసుకేళ్తే 99శాతం బతికించే అవకాశముంది. ఆస్పత్రుల్లో పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
నవతెలంగాణ-కుల్కచర్ల/ చౌడాపూర్‌
నాటు వైద్యం వద్దు. నేటి వైద్యమే రక్ష
గ్రామాలలో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో పాము కరిచిన వెంటనే వారిని నాటు వైద్యానికి తీసుకువెళ్తారు. పాము కరిచిన వెంబడే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా యాంటీ స్నేక్‌ వీనమ్‌ (ఏఎస్పీ) ఇంజెక్షన్లు అందుబాటులో గల ఆస్పత్రికి తీసుకెళ్లాలి. వైద్యుడు పరీక్షించి చికిత్సచేసి ప్రాణాపాయం సంభవించకుండా చూస్తారు. నాటు వైద్యులను, మంత్రగాళ్లను ఆశ్రయించటంతో అనసరంగా ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రజలు నాటు వైద్యం వదిలి నేటి వైద్యం ఆస్పత్రిలోని డాక్టర్లను సంప్రదించి ఇంజక్షన్‌ తీసుకోవడమే ప్రాణానికి రక్షణ కలుగుతుంది.
పరిసరాల శుభ్రతతోనే విష సర్పాలు దూరం
వర్షాకాలం వచ్చిందంటే ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. కావున పరిసరాలు ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. అప్పుడు విష సర్పాలు సరించకుండా ఉంటాయి.
పాములన్ని ప్రమాదం కాదు
పాములు వంద రకాలు ఉన్న అందులో కొన్ని రకాల పాములకే మాత్రమే విషం ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు రకాల సర్పాలు ప్రమాదకరం నాగుపాము, పెంజర, కాట్లపాము, గ్రామాల్లో సాధారణంగా కనపడే వానకోయిల, నాగులవాసం, నీరుకట్టె, జెరిపోతు, పాములు విష పాములు కావు విషం లేని పాములు పరోక్షంగా మనుషులకు సహకరిస్తాయి. భయంకర నాగుపాము పంట పొలాల్లో ఎలుకలను తింటాయి. దీంతో ఎలుకల సంతతి తగ్గుతుంది. అలాగే విషం ఉన్న పాముల గుడ్లను విషంలేని పాములు తింటాయి. 50 శాతం కాట్లు ప్రమాదం కాదు. సాధారణంగా చికిత్స తీసుకుంటే నాయమవుతుంది. పాము కాటు కన్నా చాలా మంది భయంతోనే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారు ధైర్యం చెప్పి ప్రాణాలు కాపాడాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో మందులు
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకు యాంటీ స్నేక్‌ వీనమ్‌ అందుబాటులో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పాము కాటుకు గురై ఆస్పత్రికి వస్తే వారికి వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రాణాలు కాపాడాం. పరిస్థితి విషమిస్తే ప్రాథమిక చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి తరలించి కత్రిమ శ్వాస ద్వారా బ్రతికించే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
మండల వైద్యాధికారి డాక్టర్‌ వాజీహద్దీన్‌