– బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్‌తో పార్లమెంట్‌లో చొరబడ్డ దుండగులు
– విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వ్యక్తి
– కలర్ స్మోక్ వదిలి భయభ్రాంతులకు గురిచేసిన వైనం
– బయటకు పరుగులు తీసిన ఎంపీలు
– లోక్‌సభ స్పీకర్ చైర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం
– పట్టుకున్న ఎంపీలు…భద్రతా సిబ్బందికి అప్పగింత
– విజిటర్ పాస్‌లు రద్దు…
– ఆరుగురు ఆగంతకుల గుర్తింపు
– రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు
పార్లమెంట్ పాత భవనంలో భద్రత సమస్య ఉన్నదని, కొత్త పార్లమెంట్‌లో అలాంటి సమస్య ఏదీ ఉండదని కోట్లు గుమ్మరించి కట్టిన చట్టసభలో భద్రత డొల్లతనం బట్టబయలైంది. సరిగ్గా 22 ఏండ్ల కిందట పార్లమెంట్ భవనంపై ముష్కరమూకలు దాడికి తెగబడిన రోజే..మరోసారి ఆగంతకులు ఈ చర్యకు పాల్పడ్డారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్‌తో దర్జాగా లోనికి ప్రవేశించి పొగబాంబులతో కలకలం రేపారు. మా పటిష్టమైన మూడంచెల భద్రతా వలయం దాటుకుని పార్లమెంట్‌లోకి అన్యుల ఎంట్రీ అసాధ్యం మోడీ సర్కార్ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆగంతకులు వీరంగం వేస్తుంటే..కనుచూపుమేరలో భద్రతా సిబ్బంది కనిపించలేదు. చివరికి ఎంపీలే చొరవచూపి, ఆ నిందితులను పట్టుకున్నారంటే.. పార్లమెంట్ భద్రతలోని డొల్లతనమేంటో తేటతెల్లమవుతోంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు భద్రతలో భారీ లోపం ఏర్పడింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏండ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగ (కలర్ స్మోక్)ను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. కొంత మంది ఎంపీలు ఆ ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన తరువాత ఢిల్లీ సీపీ, హౌం కార్యదర్శి అజరు భల్లా పార్లమెంట్‌కు చేరుకుని సమీక్షించారు. దాడి ఘటనతో స్పీకర్ ఓం బిర్లా ‘విజిటర్’ పాస్‌ను రద్దు చేశారు.
భారత్ మాతాకీ జై..తానా షాహీ బంద్ కరో…
లోక్‌సభలో జీరో అవర్ లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో లోక్‌సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి ‘నల్ల చట్టాలను బంద్ చేయాలి. జైభీమ్, భారత్ మాతాకీ జై’ తానా షాహీ బంద్ కరో..రాజ్యాంగాన్ని కాపాడాలి. నియంతృత్వం చెల్లదు’ అని నినాదాలు చేసినట్టు సమాచారం. లోక్‌సభలోకి దూకి స్పీకర్ చైర్ వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. బూట్లలో రంగుల టియర్ గ్యాస్ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించాడు. ఈ ఆకస్మిక ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు.
ఎంపీలే అప్రమత్తమై…
ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. పక్కనే ఉన్న ఎంపీలలో బీజేపీకి చెందిన హనుమాన్ వానియాల్, కాంగ్రెస్‌కు చెందిన గుర్జిత్ సింగ్ ఔజ్లా ఇద్దరినీ పట్టుకున్నారు. పట్టుకున్న వారిలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. నిందితులు విసిరిన పొగ కర్ర గుర్జిత్ సింగ్ చేతికి కూడా తగిలింది. ఇద్దరినీ పట్టుకుని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ వెంటనే సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఘటన చోటు చేసుకున్నప్పుడు సభలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, కార్తీ చిదంబరం, కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, బీజేపీ ఎంపీలు జగదాంబికా పాల్, సురేంద్రజిత్ సింగ్, అహ్లూవాలియా ఉన్నారు.
పసుపు,ఎరుపు రంగు పొగ వదిలి…
మరోవైపు, అదే సమయంలో పార్లమెంట్ భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు యత్నించారు. పసుపు, ఎరుపు రంగుల పొగను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ ఐబీ అధికారులు, సీనియర్ భద్రతా అధికారులు వారిని విచారిస్తున్నారు.
వైఫల్యం.. దర్యాప్తు బాధ్యత నాదే: స్పీకర్ హామీ
మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ”లోకసభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం” అని వెల్లడించారు.
భద్రత ఏదీ..?
కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ ”ఏ సెక్యూరిటీ కనిపించలేదు. ఎంపీలందరూ కలిసి ఆగంతకుడిని పట్టుకున్నారు. ఉదయం అందరం కలిసి 2001 పార్లమెంట్‌పై దాడిలో అమరవీరులను స్మరించుకున్నాం. అదే రోజు, సభలో అలాంటి సంఘటన జరిగింది. ఇది భద్రతలో లోపం” అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ మాట్లాడుతూ ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. ఆయన నుంచి నేను దానిని లాగి, బయటకు విసిరాను. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యం’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం: డింపుల్ యాదవ్
”లోక్‌సభలోకి చొరబడిన వ్యక్తులు సందర్శకులు కావొచ్చు లేదంటే ఇతరులు కావొచ్చు.. వాళ్ల దగ్గర ట్యాగ్స్ ఏమీ లేవు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని భావిస్తున్నాం. సభలో ఏమైనా జరగవచ్చు” అని ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. ”ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.. వాళ్లుకిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాళ్లను పట్టుకున్నాం. ఆ సమయంలో సభలో ఇద్దరు మంత్రులు ఉన్నారు” అని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు.
మొత్తం ఆరుగురు ఆగంతకులుగా గుర్తింపు అయ్యారు. మరో ఇద్దరు నిందితులను లలిత్, విక్రమ్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులందరూ తమ బూట్లలో పొగ డబ్బాలను తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి. ”తమకు ఏ సంఘంతోనూ సంబంధం లేదు. ప్రభుత్వం పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నందున ఈ చర్యకు పాల్పడ్డాం” అని నీలం మీడియాతో అన్నారు. వివిధ ఏజెన్సీలు ఏకకాలంలో నిందితులను విచారించాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ ఆరుగురు సోషల్ మీడియాలో ఒకరికొకరు కనెక్ట్ ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదుగురిని గుర్తించగా, ఒకరిని గుర్తించాల్సి ఉంది. ఫోరెన్సిక్ బృందం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి నమూనాలను సేకరించడం పూర్తి చేసింది. ఆరుగురు నిందితులు ఒకరికొకరు ఆరేండ్లుగా తెలుసునని, కొద్ది రోజుల క్రితం పథకం పన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురూ పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ ఇద్దరు మాత్రమే విజిటర్స్ పాస్ పొంది లోపలికి వెళ్లారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించేలా ఏదైనా సంస్థ లేదా వ్యక్తి ఆరుగురు నిందితులకు ”సూచనలు” ఇచ్చారా? అని భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
కేంద్ర హౌంమంత్రి ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు
ఈ ఘటనపై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించాలని కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌ను రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ తోసిపుచ్చారు. ‘రాజ్యసభ అనేది పెద్దల సభ అని భావిస్తున్నాను. ఇలాంటి సమయాల్లో మనమంతా ఐక్యమనే సందేశాన్ని ఇవ్వాలి. కానీ కాంగ్రెస్, ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయి. ఇది మంచి సందేశం కాదు’ అని విమర్శించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
సమగ్రంగా విచారణ జరపాలి
పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగి 22 ఏండ్లయిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన తీవ్రమైన భద్రతా వైఫల్యానికి నిదర్శనం. ఈ ఘటనలో దుండగుల ప్రవేశానికి వీలు కల్పించిన కర్నాటక బీజేపీ ఎంపీతో సహా బాధ్యులందరిపైనా సమగ్రంగా, వేగంగా దర్యాప్తు చేయాలి.
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్ తోనే ఆగంతకుల ఎంట్రీ
లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్నాటకకు చెందిన సాగర్ శర్మ, మనో రంజన్ గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మైసూర్‌కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. మైసూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ ఈ నిందితుల పాస్‌లపై సంతకం చేశారు. పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్ట్ భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హర్యానాలోని హిసార్ కు చెందిన నీలం (42) కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్ శిందే (25)గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. పార్లమెంటు లోపల, వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగ దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు.