– దేశానికే కొత్త ఒరవడి తెలంగాణ భరోసా కేంద్రాలు
– భరోసా కేంద్రాలు, షీటీమ్స్ పనితీరుకు సుప్రీం కోర్టు కితాబు
– సంగారెడ్డిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ అంజన్‌కుమార్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళలు, పిల్లల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో చైల్డ్ ప్రెండ్లీ కార్నర్, భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రత కోసం అరవిందో ఫార్మా పౌండేషన్ సహాకారంతో ఒక ల్యాండ్‌మార్క్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.2.45 కోట్ల వ్యయంతో 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా భరోసా కేంద్రాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించడం కోసం భరోసా కేంద్రాలు, ఫార్మా పౌండేషన్ కృషి చేయనున్నాయన్నారు. 2026లో స్థాపించబడిన భరోసా కేంద్రాల ద్వారా హింసకు గురైన మహిళలు, పిల్లలకు సమగ్ర మద్దతు, సహాయం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ అంతటా భరోసా కేంద్రాల నెట్‌వర్క్ నిర్వహిస్తుందన్నారు. చట్టపరమైన, మానసిక కౌన్సిలింగ్ పద్దతులతో పాటు అనేక రకాల అత్యవసర, సాధారణ సేవలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యాచార బాధితులు, పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించిన వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న భరోసా కేంద్రాలను రాష్ట్రంలో ఆరు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో నెలొల్పిన భరోసా కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసి మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ భరోసా కేంద్రాలు దేశంలోనే కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ శిఖాగోయల్, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, అరవిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి, సీఎస్‌ఆర్‌హెడ్ సదానందరెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొన్నారు.