యు జి సి డ్రాఫ్ట్ ముసుగులో ఉన్నత విద్య కాషాయీకరణ

– కేంద్రం చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు రబ్బర్ స్టాంపులు – ఛాన్స్ లర్లకు సర్వ అధికారాలు
– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ విగ్నేష్
నవతెలంగాణ కంఠేశ్వర్ 
      మోడీ ప్రభుత్వం 2018 లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను నూతన జాతీయ విద్యా విధానం – 2020 పేరుతో విద్యను కాషాయీకారణ చేయడం కోసం విద్య అనే అంశాన్ని కేంద్ర జాబితాలోనికి మార్చింది. దీనివల్ల రాష్ట్రాలకు సంబంధించిన విద్యా హక్కులను భిన్నమైన సంస్కృతిక కళలను చారిత్రక అంశాలను వక్రీకరించి కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయడంలో తన వైఖరిని ఈ నూతన యుజిసి డ్రాఫ్ట్ చే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదని మేధావులు, విద్యావంతులు ప్రకటించారు.
      కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  విడుదల చేసిన యు జి సి డ్రాఫ్ట్ పరిశీలిస్తే ఉన్నత విద్యను ఉన్నతకరిస్తున్నామని చెబుతుంది. కానీ ఈ దేశంలో ఉన్నత విద్యలో చేరుతున్న సంఖ్య చూస్తుంటే 100కు 28 శాతం మాత్రమే. ఇంకా 72 మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆల్ ఇండియా సర్వే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2035 కల్లా గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిని 50 శాతానికి పెంచుతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రస్తుతం 28.3% శాతంగా ఉంది. గత 2010 యూపీఏ -2 ప్రభుత్వ హయాంలో జి ఈ ఆర్ 19 % ఉంటే ఈ పదిండ్ల కాలంలో పెరిగినది మాత్రం 10% శాతమే. మోడీ కలలు కనే 50% చేరడానికి ఎలాంటి మార్గదర్శకాలు కూడా రూపొందించలేదు. ఇలా అయితే ఎలా సాధ్యం ? మరియు ఈ దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన డ్రాప్ అవుట్ నిష్పత్తి 25 శాతానికి పెరిగింది అంటే కళాశాలలో చేరిన ప్రతి నలుగురిలో ఒకరు డిగ్రీ కూడా పూర్తి చేయలేక పోతున్నారు. దీనిని మాత్రం కేంద్రం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు రబ్బర్ స్టాంపులు – గవర్నర్ / ఛాన్స్లర్ లకు సర్వాధికారాలు…
కేంద్రం విడుదల చేసిన యుజిసి డ్రాఫ్ట్ లో ఛాన్స్లర్లకు / గవర్నర్లకు కేంద్రం సర్వ అధికారాలు కట్టబెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలను ఇవ్వకుండానే యూజీసీ డ్రాఫ్ట్ నీ విడుదల చేసింది. అందులో వైస్ ఛాన్స్లర్ వ్యవస్థను నీరుగార్చింది. అది ఎలా అంటే ప్రస్తుతం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ ని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయించిన ముగ్గురు ప్రముఖుల పేర్లను ఛాన్స్లర్ గారికి సిఫారసు చేస్తుంది. అప్పుడు ఛాన్స్లర్ గారు ముగ్గురిలో ఒకరిని వైస్ ఛాన్స్లర్ గా యూనివర్సిటీ కి నియమిస్తారు. కానీ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ డ్రాఫ్ట్ లో సర్వ అధికారాలు చాన్స్లర్ కి ఇచ్చి వారి చేత ముగ్గురు సభ్యులతో సర్చ్ కం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రాల హక్కులను కాల రాయడం కోసం ఈ యూజీసీ డ్రాఫ్ట్ కేంద్రం తీసుకువచ్చింది. దానితో పాటుగా వైస్ ఛాన్స్లర్ పదవి కాలం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు నిర్ణయించేది. కానీ ఈ నూతన యూజీసీ డ్రాఫ్ట్ వైస్ ఛాన్స్లర్ కాలపరిమితిని ఐదు సంవత్సరాలకు పొడిగిస్తుంది లేదా ఆ వైస్ ఛాన్స్లర్లకు 70 సంవత్సరాలు నిండే వరకు కాల పరిమితిని పెంచింది. అదే కాకుండా మరలా వారికి అర్హత ఉంటే మరోసారి కూడా కొనసాగిస్తామని ఈ డ్రాఫ్ట్ చెబుతుంది.
ఇందులో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉండేవారు కూడా వైస్ ఛాన్స్లర్ పదవిని చేపట్టవచ్చు అని చెప్పడం హాస్యాస్పదమనే అంశం
కేంద్ర ప్రభుత్వం యుజిసి డ్రాఫ్ట్ ముసుగులో విద్యను కాషాయీకరణ చేయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను లాక్కోవడానికి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రయత్నాలు చేస్తుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు మేధావులు విద్యార్థులు సంఘాలు స్పందించకపోతే కేంద్రం చేతిలో విద్యారంగం కీలుబొమ్మగా మారి విద్యా వ్యవస్థకు తూట్లు పొడవడానికి అవకాశముంది. ఈ నిరంకుశత్వాన్ని అందరూ ప్రశ్నించాలి.