– 100% విద్యుత్, జీరో శాతం కాలుష్య ప్రమాణమే లక్ష్యం సాగర్ సిమెంట్ ఎండి సమ్మిడి ఆనందరెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
పరిశ్రమలో 100శాతం విద్యుత్, జీరో శాతం కాలుష్య ప్రమాణమే లక్ష్యంగా.. ఎలక్ట్రానిక్ లోడర్‌ను ఏర్పాటు చేశామని సాగర్ సిమెంట్ ఎండి సమ్మిడి ఆనందరెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమలో వోల్వా కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ లోడర్‌ను వోల్వా కంపెనీ ఎండి డెమిట్రావ్ కృష్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి 50శాతం విద్యుత్ వాడకం, 2050 నాటికల్లా వందశాతం విద్యుత్ వాడకంతో కాలుష్యాన్ని నియంత్రించడమే తమ ధ్యేయమన్నారు. దక్షిణ భారతదేశంలోనే పరిశ్రమలలో ఎలక్ట్రానిక్ యంత్రం మొట్ట మొదటిసారిగా సాగర్ సిమెంట్ పరిశ్రమలో ప్రారంభించామని తెలిపారు.
దేశవ్యాప్తంగా(ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లుగా మార్చేందుకు ఇప్పటికి పది పరిశ్రమలు ఎస్టీపీలో చేరాయని చెప్పారు. రానున్న 30 ఏండ్ల కాలంలో వాయుకాలుష్యం లేకుండా, డీజిల్, బొగ్గు, లైమ్ స్టోన్, నీరు, ఆయిల్ వాడకం తగ్గిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బ్యాటరీ ద్వారా నడిచే యంత్రాలు వచ్చాయని, రానున్న రోజుల్లో హైడ్రోజన్, పవర్ కనెక్టివిటీతో నడిచే యంత్రాలు తీసుకొస్తామన్నారు.
వోల్వో ఎండి మాట్లాడుతూ.. వాతావరణం ఇదేవిధంగా ఉంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలిపారు. ఈయంత్రాల వాడకం ద్వారా ఒకటిన్నర డిగ్రీల టెంపరేచర్‌కు తగ్గించేందుకు దోహదపడతాయన్నారు. ఇప్పటికి తాము 1000 వాహనాలు తయారు చేశామన్నారు. ఎలక్ట్రికల్ యంత్రం గంటపాటు చార్జింగ్ పెడితే ఏడు, ఎనిమిది గంటలు పనిచేస్తుందని తెలిపారు. డీజిల్ కంటే తక్కువ ఖర్చు వస్తుందన్నారు. తమ సిమెంట్ పరిశ్రమ పర్యావరణం, ఆరోగ్య భద్రత, ఉద్యోగి సంక్షేమం, సామాజిక అభివృద్ధి వంటి అనేక అంశాల్లో సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పారు. భారతదేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఆకర్షణీయమైన కంపెనీగా ఉండటం, తమ భాగస్వాములందరికీ సంపద కల్పించడం అంతిమ లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ప్రెసిడెంట్ పి.గణేష్ సమ్మిడి సిద్ధార్థరెడ్డి, సమ్మిడి అనిశ్‌రెడ్డి, గ్రూప్ వైస్‌ప్రెసిడెంట్ అంజిరెడ్డి, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.