కేఆర్‌ఎంబీ చేతిలోకి సాగర్‌ డ్యాంకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత

Sagar Danku CRPF security in hands of KRMB–  ప్రధానకార్యదర్శులు, డీజీపీలతో వీడియోకాన్ఫరెన్స్‌
–  కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల అంగీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నాగార్జునసాగర్‌ కృష్ణాజలాల విడుదల విషయంలో నవంబర్‌ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, ఈ డ్యామ్‌ నిర్వహణను కష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు(కేఈఆర్‌ఎంబీ)కి అప్పగించడంతోపాటు సీఆర్‌పీఎఫ్‌ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అంగీకరించాయి.
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నుంచి ఈనెల 29న ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్బంగా తలెత్తిన వివాదంపై నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు కుమార్‌ భల్లా తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కష్ణా రివర్‌ వాటర్‌ మేనేజ్మెంట్‌ బోర్డు అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ నవంబర్‌ 29న రాత్రి ఆంద్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జునసాగర్‌ డ్యాంపైకి వచ్చి సీసీ కెమెరాలను ద్వాంసం చేయడంతోపాటు ఐదు, ఏడు గేట్ల వద్ద వున్నా హెడ్‌రెగ్యులేటర్లను తెరిచి దాదాపు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సష్టించిందని చెప్పారు. గత రేండేండ్లుగా ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండవసారి అని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఈ చర్యతో హైదరాబాద్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతికుమారి ఆందోళన వ్యక్తంచేశారు. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్‌-కో ని కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కాగా, నాగార్జునసాగర్‌ డ్యాంపై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్‌-కో కొనసాగించాలనీ, ఈ డ్యామ్‌ ను కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ దళాల పర్యవేక్షణలో తాత్కాలికంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్టు భల్లా చెప్పారు. వీడియోకాన్ఫరెన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్‌, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, జీఏడీ కార్యదర్శి వి. శేషాద్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, అదనపు డీజీ ఎస్‌.కె.జైన్‌, ఐజి షానవాజ్‌ కాశీ, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.