సాగర్‌ తీరాన బాలల కళల సృజనకారుడు

సాగర్‌ తీరాన బాలల కళల సృజనకారుడుఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి యివ్వాళ్ళ బాల సాహిత్యం బహుముఖాలుగా వస్తోంది. బి.ఎన్‌.శాస్త్రి మొదలు మేరేడ్డి యాదగిరి రెడ్డి వరకు, పుప్పాల కృష్ణమూర్తి నుండి డా.సిరి వరకు ఈ నీలగిరి వారసత్వం నేటి బడిపిల్లల దాకా వారసత్వంగా వచ్చింది. బాలల కోసం బొమ్మలేయడంలో సంతకమై నిలిచిన కూరెళ్ళ శ్రీనివాస్‌ది ఈ నేలనే. పోరాటాల నేల యివ్వాళ్ళ బాలల వికాసం కోసం ఆరాట పడడం బాగుంది. ‘కుర్రాల్లొస్తున్నారు కొత్త గొంతులెగరేసుకుంటూ..’ అని శ్రీశ్రీ అన్నట్టు బాల సాహిత్య రంగంలోనూ కుర్రాలళ్ళని అనలేం కానీ కొత్త కలాలు ఈ నేల మీదినుండి అద్భుతంగా తన దైన గొంతుకతో సంతకాలు చేస్తున్నాయి. అలా గత ముప్పై యేండ్లుగా కార్టూన్‌ గీతకారునిగా తెలుగు పాఠకులకు పరిచయమై, గత పదేండ్లుగా బాలల కథా రచయితగా వెలుగుతున్న మిత్రుడు, రచయిత వడ్డేపల్లి వెంకటేశ్‌.
వడ్డేపల్లి వెంకటేశ్‌ 21 మార్చి, 1975న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పుట్టాడు. శ్రీమతి వడ్డేపల్లి శారదమ్మ – తండ్రి శ్రీ వడ్డేపల్లి లింగయ్య. ఎం.ఎస్సీ., బిఎడ్‌ చదివి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వెంకటేశ్‌ కార్టూన్‌ చిత్రకారునిగా ఆరంగేట్రం 1992న మొదలు పెట్టాడు. దాదాపు 8000 కు పైగా కార్టూన్లు గీసిన ఈయనకు గీత అంటే మిక్కిలి ప్రేమ. సునిశితమైన హాస్యం, చక్కని పరిశీలన, వెగటు పుట్టించకుండా సాగే ఎత్తిపొడుపు, చరుపు చరిసినట్టు తట్టిలేపే వ్యంగ్యం వెంకటేశ్‌ గీసే బొమ్మల తత్త్వం. మూడు దశాబ్దాల్లో ‘బాపు-రమణ పురస్కారం’ మొదలుకుని దాదాపు అరవైకి పైగా జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, పురస్కారాలు ఈయన అందుకున్నాడు. వీటిలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ వారి నుండే ఏడుసార్లు ఇతని కార్టూను ఎంపిక కావడం విశేషం. ఇంకా… కార్టూన్‌ వాచ్‌ మాగజైన్‌ జాతీయ కార్టూన్ల పోటీలో ఐదుసార్లు బహుమతి అందుకున్నాడు. ఓటరు చైతన్య కార్టూను ప్రథమ బహుమతి గెలవడమేకాక రాష్ట్రమంతటా ప్రదర్శింపబడింది. కన్నడ, తమిళ, హిందీ ఇతర భాషల పత్రికల్లో వీరి కార్టూన్లు అచ్చయ్యాయి.
బాలల కోసం గీసిన బొమ్మలు అనేక పత్రికల్లో వచ్చాయి. పలు కథల సంకలనాలు, సంపుటాలకు వెంకటేశ్‌ గాసిన బొమ్మలు ముఖచిత్రాలై విలసిల్లుతున్నాయి. బాలల కథల విషయానికి వస్తే వందకు పైగా పిల్లల కోసం కథలు రాశాడు. ఇది నవ తెలంగాణ మొదలు ఈనాడు వరకు అన్ని ప్రధాన పత్రికల్లో, అంతర్జాల మాధ్యమాలలో వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలకు చిత్రాలు కూడా అందించాడు. గతంలో గరిపెల్లి – పత్తిపాక ఫౌండేషన్‌లు ‘రీడ్‌’ కార్యక్రమంలో భాగంగా తెచ్చిన ‘చిలుకల దండ’ బాలల కథల సంకలనంలోని కథకుల్లో వెంకటేశ్‌ ఒకరు. ఈ పుస్తకానికి ముఖచిత్రంతో పాటు లోపలి బొమ్మలు కూడా ఈయనే గీశాడు. పూర్తిగా వెంకటేశ్‌ కథలు, బొమ్మలతో వచ్చిన బాలల కథల ‘పిల్లల జాబిలి’ వెంకటేశ్‌ కొత్త కథల సంపుటి.
‘పిల్లల జాబిల్లి’ ముప్పైమూడు కథల సమాహారం. పెన్సిల్‌, కుంచెలు పట్టి బొమ్మను ఎంత వైపుతో దిద్దుతూ రంగులను అద్దుతాడో అంతేవైపుగా, ఒడుపుగా కథను రాస్తాడు వెంకటేశ్‌. పోగుపోగును పడుగుపేకల్లా చేసి బట్టనేసినట్టు. అందుకే ఆయన కథలు అందంగా ఉంటాయి. ‘హరితవనం’ కథ అనేక మలుపులు తిరిగి చివరకు పిల్లల వల్ల చెట్టు కొట్టకుండా నిలవడం అనేది ఇందులోని మెరుపు. బాలల కథల్లో ఇలాంటివే ఉండాలి మరి.. అంటే వాళ్ళ కథలకు వాళ్లే నాయకులన్నమాట. ‘కొంగజపం’ కథ నా ఒక్కడికే కాదు, తరతరాలుగా అందరికీ తెలిసిందే! అయితే వెంకటేశ్‌ దీనికి కొంత వ్యంగ్యాన్ని జోడించి, మరో కొత్తపాత్రను ఇందులో చొప్పించడం బాగుంది. చిన్నారి పాపకు ‘కోతి – బంగారు గాజు’ను పుట్టిన రోజు కానుకగా ఇవ్వడం అనే అంశం మన పిల్లలకు బాగా నచ్చుతుంది. వెంకటేశ్‌ కార్టూనిస్టు కదా! ఆయన గీత ఎలా చూడగానే నవ్వు పుట్టిస్తుందో, ఆయన కథలు కూడా చదవగానే అంతే ప్రభావం చూపుతాయి. ‘కావ్‌.. కావ్‌.. కాకి’, ‘పట్నం కాకి-అడవి కాకులు’ వెంకటేశ్‌ విలక్షణతను తెలిపే కథలైతే, ‘దారి చూపిన రామచిలుక’, ‘మిఠాయి దొరికింది’, ‘కప్ప సాయం-సొరచేప మాయం’ వంటి కథలు చదివిస్తాయి. ‘తింగరి తిమ్మన్న – మామిడి టెంక!’, ‘ఠప్‌… ఠప్‌… ఢాం.. ఢాం…!’ వంటివి ఈ కథల సంపుటిలోని గమ్మత్తైన కథలు. వడ్డేపల్లి వెంకటేశ్‌ బాలల కోసం రాసిన కథలు ఎంత ఆలోచనను, ఆనందాన్ని, జాగరూకతను కలిగిస్తాయో, ఆయన ఈ కథలకు గీసిన బొమ్మలు కూడా అంతే లోతుగా ఆలోచింపజేస్తాయి. ప్రఖ్యాత భారతీయ బాల సాహితీవేత్తలు, చిత్రకారులైన పార్థ సేన్‌గుప్తా, అశోక్‌ దావర్‌, అబిద్‌ సూరతీ, జగదీశ్‌ జోషి వంటి వారి కోవలోనే అటు రాతలోనూ, ఇటు గీతలోనూ జకాత్‌ నేతమీది జరీపోగై మెరవాలనీ కోరుతూ.. జయహో! బాల సాహిత్యం! ఇవ్వాళ్ళ అవిష్కరింపబడుతున్న ‘పిల్లల జాబిల్లి’ కి చుక్కల స్వాగతం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548