సాగర్‌ జల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలి

సాగర్‌ జల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలి– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాగార్జునసాగర్‌ జల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక సాగర్‌లో కేవలం 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకాలం వినియోగించినట్టుగానే ఈ నీటిని కృష్ణా రివర్‌బోర్డు అనుమతితో ఉభయ తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలని కోరారు. కానీ తెలంగాణ ఎన్నికల బిజీలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యతను నెలకొల్పి సానుకూలంగా సమస్యను పరిష్కరించవలసిన కేంద్రం ఆ పాత్ర పోషించలేదని తెలిపారు. ఇప్పటికైనా రంగంలోకి దిగిన కేంద్రం వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతాయుతంగా ఆ వివాదాన్ని పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.