– పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : సహారా గ్రూపునకు చెందిన నాలుగు సంస్థలు అక్రమంగా సమీకరించిన నిధులు ఎట్టకేలకు తిరిగి డిపాజిటర్లకు చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. సహారాలోని నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును 45 రోజుల్లో తిరిగివ్వనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. దీనికి సంబంధించిన రిఫండ్ పోర్టల్ సీఆర్‌సీఎస్-సహారా రిఫండ్ పోర్టల్‌ను మంగళవారం అమిత్ షా ఆవిష్కరించారు. 2008, 2009 ఏడాదిలో సుబ్రతారారుకు చెందిన సహారా కోఆపరేటివ్ సొసైటీ, సహరయన్ యునివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీలు నిబంధనలకు విరుద్దంగా 2.5 కోట్ల మంది వద్ద నుంచి రూ.30,000 కోట్ల మేర డిపాజిట్లను సమీకరించాయి. సహారా గ్రూప్ సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్ట్ ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చింది. ఆ మొత్తం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ ఖాతాలో జమ అయ్యింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం గత మార్చిలో తెలిపింది. ఈ క్రమంలోనే చెల్లింపులకు కొత్త పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేయనున్నామని అమిత్ షా తెలిపారు. తొలి దశలో ఈ మొత్తంతో 1.7 కోట్ల డిపాజిటర్లకు చెల్లింపులు చేయొచ్చని పేర్కొన్నారు. రూ.30 వేల వరకు డిపాజిట్ చేసిన వారు 2.5 కోట్ల మంది వరకు ఉన్నారని తెలిపారు. రూ.5వేల కోట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామమన్నారు. మిగిలిన వారికి చెల్లింపులు చేస్తామన్నారు.