సాహిర్ మెట్రిక్యులేషన్ మాల్వా ఖాల్సా హైస్కూల్ లూధియానలో చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత 1939 లో ఎంట్రెన్స్ పరీక్షలో నెగ్గాక లూధియాన ప్రభుత్వ కళాశాలలో చేరాడు. ఆ సమయంలో, లూథియానా ఉర్దూ భాషకు శక్తివంతమైన, చురుకైన కేంద్రంగా ఉండేది.
సాహిత్యం:
చిన్నప్పటి నుంచి కవిత్వం చదవడం, రాయడం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. మౌలానా ఫైజ్ హర్యాన్వీ మార్గదర్శకత్వంలో అతను ఉర్దూ, పర్షియన్ భాషలను అభ్యసించి, ఆ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇక్బాల్ ఒక ద్విపదలో, సాహిర్ అనే పదాన్ని చూశాడు. దీని అర్థం మంత్రముగ్ధులు లేదా మాంత్రికుడు. దానిని తన కలం పేరుగా తీసుకున్నాడు. సాహిర్ తన కలం పేరును సార్ధకం చేసుకున్నాడు.
తన నగరం లుధియాన కాబట్టి లూథియాన్విగా తన పేరు చివరన తగిలించుకొన్నాడు. తన భావోద్వేగాలకు, మనోభావాలకు కవితారూపం ఇచ్చిన తీరు ఆయన సమకాలీన కవులెవరూ ఇవ్వలేదు. శృంగారాన్ని, నిరసనను కలగలిపి సాహిర్ తన వ్యక్తిత్వంతో అభ్యుదయ ఉద్యమ కవిత్వానికి కొత్త దిశానిర్దేశం చేశాడు. అతని కవితల్లో రాజకీయ, నిరసన, వెచ్చదనం ఉంటాయి. అతని పదాల ఎంపిక, ఉపమానాలు, రూపకాలను ఉపయోగించే విధానం ఇతర కవులకు అందనంత సంపూర్ణంగా, సమగ్రంగా ఉంటాయి. సాహిర్ సమకాలీన కవులు ఫైజ్ అహ్మద్ ఫైజ్, మజ్రూ సుల్తాన్ పూరి, జాన్ నిసార్ అఖ్తర్, రాజేందర్ సింగ్ బేది మొదలైన పేరు ప్రఖ్యాతులు గాంచిన వారి మధ్య సన్నిత స్నేహం కలిగి ఉన్నాడు.
పాట, సంగీతం, సాహిత్యం పదాల కూర్పు అతని గజల్స్, గేయాలు సినీ పాటలు మరింత ప్రభావవంతం చేశాయి. బాగా ప్రజాదరణ పొందాయి. అతని మొదటి సంకలనం ‘తలియాన్’ 1944లో ప్రచురించబడి, హాట్ కేక్ లా అమ్ముడుబోయింది.
లూథియానాలో ఉన్న రోజుల్లోనే సాహిర్‌లో రాజకీయ స్పృహ ప్రారంభమైంది. కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. బి.ఎ. చివరి సంవత్సరంలో (ఫైనల్ లో) ఉండగా అతని క్లాస్‌మేట్ అషెర్‌కౌర్‌తో ప్రేమలో పడ్డాడు. కాలేజీ నుంచి బహిష్కరించబడి, బి.ఏ చేయలేకపోయాడు. కళాశాలను విడిచిపెట్టి లాహోర్‌కు వెళ్లి దయాల్ సింగ్ కాలేజీలో చేరాడు. రాజకీయ కార్యకలాపాల కారణంగా అతను అక్కడ నుండి కూడా బహిష్కరించబడ్డాడు. కానీ పరిస్థితులు అతన్ని రొమాంటిక్ కవిగా మార్చాయి.
తాజ్ మహల్ కవిత తన 19 సంవత్సరాల ప్రాయంలోనే రాశాడు. సాహిర్‌కు ఇది మంచిపేరు తెచ్చిపెట్టింది. ఎందరో దీన్ని కొనియాడారు.
మేరే మెహబూబ్ కహీ ఔర్ మిలా కర్ ముజ్సే,
బజ్మ్-ఎ-షాహి మే గరీబో కా గుజార్ క్యా మానే.
సబత్ జిన్ రహౌ పర్ హై సత్బత్-ఎ-షాహికే నిషాన్
ఉస్పే ఉల్ఫత్ భరీ రహౌం కా గుజార్ క్యా మానే
సాహిర్ లుధియాన్వి తన ప్రేమికురాలిని తాజ్ మహల్‌లో కాకుండా మరెక్కడైనా కలవమని కోరుతాడు. అక్కడున్న సమాధి చాలా సంవత్సరాలుగా విలాసవంతమైన రాచరికానికి చిహ్నం. తాజ్‌మహల్‌లో మరో చోట అంటాడు, ‘ఏక్ శహీన్ షా నే దౌలత్ కా సహార లేకర్/ హం గరీబో కి మొహబత్ కా ఉడాయ హై మజాక్ / మేరి మహబూబ్! కహీ ఔర్ మిలాకర్ ముజ్ సే’ (ఒక చక్రవర్తి తన ధన-సంపదల సహాయంతో మా బీదవాళ్ల ప్రేమను చేశాడు అపహాస్యం. ఓ ప్రియసీ! మరో చోట కలుసుకో నాతో)
సాహీర్ షాయరీ 1940-1960 లో యువతను ఓ ఊపు వూపి, ఊర్రూతలూగించింది. ఆ కాలపు ప్రామాణిక సాహిత్య పత్రిక అయిన ‘అదాబ్-ఎ-లతీఫ్’కి అతను సంపాదకుడయ్యాడు. తరువాత, ‘సవేరా’ కు, అతని సాహిత్య పత్రిక ‘షహకర్’కు కూడా సంపాదకత్వం వహించాడు.
సాహిర్ సాహిత్య సేవలకు గుర్తింపుగా 1971లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 1972లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘జస్టిస్ ఆఫ్ పీస్’ అవార్డును ప్రదానం చేసింది. 1973లో ‘ఆవో కోయి ఖ్వాబ్ బునె’ రచనకు గాను ఆయనకు ‘సోవియట్ నెహ్రూ అవార్డు’ లభించింది. మహారాష్ట్ర ‘రాష్ట్ర సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. 1974లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్’గా నామినేట్ చేసింది. లూధియాన కాలేజీ లో ఉన్న ఆడిటోరియం కు ‘సాహిర్ ఆడిటోరియం’ గా నామకరణం చేశారు. ఆయన కవితలు ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి.
అతని కవితా సంకలనాలు: తలియా, పర్చాయియా, ఆవో కే కోయీ ఖాబ్ బునే, సాత్ గాత జాయే, బంజార.
సినీ జగత్తులో: అదే సమయంలో అతని కళాశాల స్నేహితుడు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరాడు. అతను ‘ఆజాదీ కి రాహ్ పర్’ సినిమా తీస్తున్నాడు. సాహిర్‌ను పాట రాయమని ఆహ్వానించాడు. సాహిర్ బొంబాయికి వెళ్లాడు. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో సాహిర్ గీత రచయితగా సినీప్రపంచంలో తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం పాపులర్ అప్పీల్, సారాంశం లేకుండా పాటలు రాయడానికి అతను సిద్ధంగా లేకపోవడమే ఇందుకు ఒక కారణం. యాదృచ్ఛికంగా, అతను ఎస్.డి బర్మన్‌ను కలిశాడు. బర్మన్ సాహిర్ కు ఒక ట్యూన్ ఇచ్చాడు. ఇప్పటికీ ప్రసిద్ధి చెందిన ‘తండి హవాయెన్’ (నవ్ జవాన్ 1951) అనే పాటను రాశాడు సాహిర్. బర్మన్, సాహిర్ సాహిత్యాన్ని ఇష్టపడ్డాడు. వీరిద్దరి జోడి ప్రజల హృదయాల్లో నాటుకు పోయే, గుర్తుండిపోయే పాటలను అందించారు. సాహిర్ సంగీతకారులు రవి, రోషన్, ఖయ్యాం, దత్తా నాయక్, లక్ష్మికాంత్-ప్యారేలాల్, బల్‌దేవ్ రాజ్ చోప్రా తో కూడ పని చేశాడు.
సాహిర్ కవితా విస్తీర్ణం, మూలాంశాల పరిధి కూడా సాటిలేనివి. అతను రాజకీయ, శృంగార, మానసిక, ప్రకృతి కవిత్వం, విప్లవ కవిత్వం రాశాడు. ఇందులో రైతుల, కార్మికుల తిరుగుబాటు మన దృష్టిని ఆకర్షిస్తుంది. అతని గేయాలలో తన వ్యక్తిగత అనుభవాలు పరిశీలనల ప్రత్యేక దృశ్యాలు ఉన్నాయి.
అప్పుల బాధతో నలిగిన రైతు, వేరొకరి యుద్ధానికి వెళ్లిన సైనికుడు, తన శరీరాన్ని బలవంతంగా అమ్ముకోవలసి వచ్చిన స్త్రీ, నిరుద్యోగంతో నిరాశ చెందిన యువత, వీధిలో నివసిస్తున్న కుటుంబం సాహిర్ హృదయానికి దగ్గరగా ఉన్నాయి.
భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ప్యాసా సినిమా (1957) లోని సాహిర్ గేయం, ”యే దునియ అగర్ మిల్ భి జాయె’ / ‘యె కుచె, యె నీలం ఘర్ దిల్ కశికె, యె లుటతె హువే కార్వ జిందగి కె, కహ హై, కహ హై ముహఫిజ్ ఖుదా కె, జిన్ నాజ్ హై హింద్ పర్ వో కహ హై” కదిలించిందని చెప్పారు.
సాహిర్ తన సమకాలీనుల కన్నా భిన్నమైన రచనలు చేశాడు. అతని కవితలు, సినీ గేయాలు ప్రత్యకంగా ఉండేవి. అతడు సాధారణంగా ఉర్దూ షాయర్లు సజించే ఖుదా (దేవుడు), హుస్న్ (సౌందర్యం, జామ్ (వైన్) ను స్తుతించలేదు. అతను సమాజంలో క్షీణిస్తున్న విలువల గురించి చేదు-నిజాలతో సున్నితమైన సాహిత్యాన్ని రాశాడు. యుద్ధం, రాజకీయాల తెలివిలేనితనం, ప్రేమపై వినియోగదారుల ఆధిపత్యం వంటివాటితో అతని ప్రేమ పాటలు, దు:ఖంతో నిండి ఉన్నాయి. ప్రేమ కంటే ముఖ్యమైన, చురుకైన భావనలు కూడా ఉన్నాయని అతని రచనలు వ్యక్తం చేస్తున్నాయి.
సాహిర్ లెక్కలేనన్ని హిట్ పాటలు రాశాడు. ”సాథీ హాత్ బడాన (నయా దౌర్ 1957), ఔరత్ నే జనం దియా మర్దో కో’ (సాధన 1958), తు హిందు బనేగ న ముసల్మాన్ బనేగా (ధూల్ కా ఫూల్ 1959), ఖవ్వాలి సాంగ్ ‘ యే ఇష్క్ ఇష్క్ హై’ బరసాత్ కీ రాత్ 1960),’తుం అగర్ సాథ్ దేనె క వాదా కరో’ (హమ్రాజ్ 1967),’మై పల్ దో పల్ కా షాయర్ హూ” (కభీ కభీ 1976).. వంటివి వాటిలో కొన్ని.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకున్న పాటలు- ”జో వాదా కీయా వో నిభాన పడేగా” (తాజ్ మహల్ 1960 ), కభీ కభీ మేరే దిల్ మే’ (కభి కభి 1977).
జీవితం లో చిన్న మలుపు:
1949లో సాహిర్ లుధియాన్వీ లాహోర్‌లో వున్నప్పుడు జరిగిన ఒక సమావేశంలో ”అవాజ్-ఎ-ఆడమ్” (ది వాయిస్ ఆఫ్ మ్యాన్) కవితను చదివాడు. అందులో ‘హమ్ భీ దేఖేంగే’ అనేది చిరస్మరణీయమైన పదబంధంగా జనాల నోట్లో నానసాగింది. కమ్యూనిజం ఎర్రజెండా ఎత్తుగా ఎగురుతుందని, రెచ్చగొట్టే విధంగా ఉందని పాకిస్థాన్ ప్రభుత్వం భావించింది. సోవియట్ కమ్యూనిజాన్ని అరికట్టడానికి పాశ్చాత్య ప్రయత్నాలలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉండాలని నిర్ణయించుకుంది. కమ్యూనిజం వ్యతిరేక విధానంలో అమెరికాకు బలమైన మిత్రపక్షంగా ఉండగలదని ఒప్పించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించింది.. దక్షిణాసియాలోనే కాకుండా మధ్యప్రాచ్యంలో కూడా పశ్చిమ దేశాలకు తమను తాము విశ్వసనీయ మిత్రదేశంగా అభివర్ణించుకోవాలని పాకిస్థాన్ కోరుకుంది.
కవిత చదివిన తర్వాత, సాహిర్‌ను నిఘా సంస్థలు బెదిరించ సాగాయి. అప్పుడే అతను భారతదేశానికి వలస వెళ్ళాడు. తత్ఫలితంగా, ‘హమ్ భీ దేఖేంగే’ అనే పదబంధం సాహిర్ పాకిస్తాన్‌కు వీడ్కోలు పలికింది.
ఈ కవిత నుంచి కొన్ని పాదాలు, వాటికి ఇంగ్లీష్ అనువాదం.
దబేగి కబ్ తలక్ ఆవాజ్-ఎ-ఆదమ్ హమ్ భి దెఖెంగే/రుకేంగే కబ్ తలక్ జజ్బాత్-ఎ-బర్హమ్ హమ్ భి దేఖేంగే/…../కరోగె కబ్ తలక్ నావక్ ఫరాహమ్ హమ్ భి దేఖేంగే/కహాన్ తక్ హై తుమ్హారే జుల్మ్ మే దమ్ హమ్ భి దెఖెంగే/ యే హంగామ్ -ఎ-విదా-ఎ-షబ్ హై ఏ జుల్మత్ కె ఫర్జందో/
సహర్ కె దొష్ పర్ గుల్ నార్ పర్చమ్ హమ్ భి దేఖేంగే/ తుమే భి దేఖ్నా హౌగ యే ఆలమ్ హమ్ భి దేఖెంగే.
(Till when can the voice of Adam be suppressed? We too shall see /Till when can angry emotions be controlled? We too shall see……/ sons of darkness this is the for departure/We too shall see the morning wear the flag of red colour/You too will have see this clamour, and we too shall see. (English translation by Raza Naeem President of the Progressive Writers Association, Lahore-Pakistan.) ఫైజ్ అహ్మద్ ఫైజ్ సాహిర్ నుండి ‘హమ్ భీ దేఖేంగే’ అనే పదబంధం అరువు తీసుకున్నాడు. అతడు మరో విధంగా రాశాడు. ‘హమ్ దేఖెంగే’ 1979 లో పాకిస్థాన్ అధ్యక్షుడు జియా ఉర్ రహమాన్ నియంతత్వానికి వ్యతిరేకంగా రాశాడు. ఇండియాలో బాగా పేరు తెచ్చింది ఫైజ్ కవిత. JNU విధ్యార్ధుల నిరసన సభలలో తారస్థాయికి చేరింది.
ప్రేమ బంధం:
సాహిర్ లూధియాన్వి, అమ్రితా ప్రీతం మధ్య బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడే ప్రేమ బంధం ఏర్పడింది. స్వతంత్ర భారత దేశంలో కొచ్చాక కూడా వీరిద్దరు కలుసుకొంటూండేవారు. కాని అది ఫలించని మూగ ప్రేమ. గంటల తరబడి అమ్రితా ఇంట్లో ఓ గదిలో కూర్చొని సాహిర్ సిగరేట్లు కాలుస్తూండే వాడు. అమ్రితా అతనికెదురుగా కుర్చీలో కూర్చొని ఉండేది. చైన్ స్మోకర్. కాని సిగరేట్లు పూర్తిగా కాల్చకుండా సగానికి పైగా సిగరేట్లు ఆష్ ట్రేలో వదిలేసేవాడు. అతడు వెళ్లిపోయాక వాటిని అమ్రితా తిరిగి కాలుస్తూ అతని చేతి వేళ్ల స్పర్శ అనుభవిస్తూండేది. అలా అమ్రితకు సిగరేట్లు కాల్చే అలవాటైంది! సినీ రంగంలో నేపథ్య గాయిక, నటిమణి అయిన సుధ మల్‌హోత్రతో కూడా ప్రేమ వ్యవహారం నడిపాడు. కాని అది కూడ భగ ప్రేమగా చరిత్ర పుటలలోకెళ్లిపోయింది.
సాహిర్ తల్లిచాటు బిడ్డ. ప్రతి విషయం తన తల్లితో చెప్పుకొంటూండేవాడు. చివరికి వయోజన దశలోకి వచ్చిన అదే వరుస. కవి సమ్మేళనాలకు వెళ్లినా తల్లి తనతో ఉండాల్సిందే! సాహిర్ తన జీవితంలో జీవితాంతం ప్రేమించిన మహిళ, తన తల్లియే.
బొంబాయిలో సాహిర్ అక్టోబర్ 25, 1980లో తీవ్ర గుండెపోటుతో చివరి శ్వాస వదిలాడు. సాహిర్ లూధియాన్వి ఉర్దూ సాహిత్యంలో ధృవ తారగా వెలుగుతూనే ఉన్నాడు.
ప్రసిద్ద ఉర్దూ షాయర్, సినీ గేయ రచయిత సాహిర్ మార్చి 8, 1921న లూథియానాలోని భూస్వామ్య పంజాబీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అబ్దుల్ హై అతని అసలు పేరు. అతని తండ్రి పేరు చౌదరి ఫజల్ మొహమ్మద్. తల్లి సర్దార్ బేగం. సాహిర్ సర్దార్ బేగంకు మొదటి సంతానం. కోటీశ్వరుడి సంతానం అయినా బాల్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో గడిచింది. తల్లి తన భర్తతో నానా హింసలకు బలైంది. చివరికి అతనితో విడాకులని తీసుకొని సాహీర్‌ను తీసుకొని చాలా దూరం వెళ్లి పోయింది. అబ్దుల్ హై కస్టడీ కోసం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు తల్లి పక్షం వైపు తీర్పు ఇచ్చింది.
అమ్జద్,
00966507662638