
తొంబై యేళ్లలో, 106 పుస్తకాలను ప్రచురించి చండూరు సాహితీ మేఖల తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఒక ధృవతారగా ప్రకాశిస్తోందని సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ ప్రశంసించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాహితీ మేఖల ప్రచురించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో పదేళ్ళలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనున్న సంస్థ వైభవాన్ని హరికృష్ణ కొనియాడారు.దాశరథి లాంటి ఎందరో కవులకు సాహితీ మేఖల వేదిక అయిందన్నారు.1940 దశకంలోనే సంస్థ వ్యవస్థాపకులు అంబడిపూడి వెంకట రత్నం నాటకాలు రాయడమే కాక ప్రదర్శనలు నిర్వహించడం గొప్ప విషయమని ప్రస్తుతించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ.ఎస్.డి.గా ఉన్న విద్యాసాగర్ మాట్లాడుతూ కవులు సమాజాన్ని మేలుకొల్పడంలో వయో భారాన్ని,ఇతర సమస్యలను లెక్క చేయరని అన్నారు.తమ గురువు సుందర దేశికులకు అభినందనలు తెలిపారు.సాహితీ మేఖల సభ్యులు ఆత్తాన్ సుందర దేశికులు, అత్తాన్ వరద దేశికులు రచించిన సుందరారామం, శ్రీ కృష్ణ చరితామృతం, వరదానందలహరి గ్రంథాలను ప్రముఖ సాహితీవేత్తలు డా.శ్రీరంగాచార్య , ఆచార్య మసన చెన్నప్పలు ఆవిష్కరించారు.సాహితీ మేఖల అధ్యక్షులు అంబడిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కవిత్వాన్ని వెలువరించిన రచయితలను అభినందించారు.సంస్థ కార్యదర్శి పున్న అంజయ్య దేశిక సోదరుల పరిచయం చేసారు.డా.ఇడికూడ సచ్చిదానందం గ్రంథ సమీక్ష నిర్వహించారు.చికాగోలో డాక్టర్ గా పనిచేస్తున్న కోయ సుజాత రచించిన ప్రత్యూష కిరణాలు కవితా సంపుటి ఆవిష్కరణ కూడా ఇదే వేదికపై జరిగింది. సాహితీ మేఖల వ్యవహర్త మంచుకొండ చిన్న భిక్షమయ్య అతిథులను జ్ఞాపికలు,శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాహితీ మేఖల సభ్యులు మద్దోజు వెంకట సుధీర్ బాబు,డా.ఐ.నిర్మలానందం, కస్పరాజ్ తల్పనేని తదితరులు పాల్గొన్నారు.