పదాల పందిరిని పేర్చుకుంటూ,
అక్షరాలతోటి అందమైన కవనాలను
అల్లుకుంటూ, సాహితీ జగతిలోకి
నూతన వరవడితో సుతారంగా అడుగు పెట్టిన ఆకుల రఘురామయ్యకు స్వాగత సుమాంజలులు పలుకుతూ, ఆయన కలం నుంచి జాలువారిన కవిత్వ ధారయే ‘జ్ఞాపకాల పొరల్లో’
ఈ సంపుటిలో మొత్తం 53 ఖండికలతో ముద్రితమై పాఠకులకు సాహిత్య పాయసాన్ని తాగిస్తుంది. ఇందులోని ప్రతీ కవిత ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కవి అంతరంగంలో జరిగిన సంఘర్షణయే ఈ కవన కుసుమాలు. వారి మదిలో మెదిలిన భావాలను, రగిలిన వేదనలను, మనుషుల మధ్య పెనవేసుకొన్న బంధాలను చాలా చక్కగా తన సిరాతో ప్రతీ కవితను శిల్పం గా చెక్కాడు. ”కలాం-సలాం” అనే కవితలో
”పోరాటానికి ఓనమాలు నేర్పి
విజయానికి దరహాసం చేర్చి
కష్టాల కడలికే ఈతలో తర్ఫీదు ఇచ్చి
కార్యసాధనకు చిరునామాగా
నిలిచిన అనితర సాధ్యుడు”
అని అబ్దుల్ కలాం వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఆయన పడిన కష్టాలను, కన్నీళ్లను గురించి కవి చక్కగా వర్ణించాడు. అలతి అలతి పదాలతో విశాల మైన అర్ధం స్ఫురించే విధంగా చెప్పడం అనేది కవి చేసిన పద ప్రయోగాన్ని, పద సంపదను తెలుపుతుంది. ”గట్టికోట – వట్టికోట” అనే కవితలో
”ఒక చేత పెన్ను పట్టి
మరో చేత గన్ను పట్టి
ప్రజల కోసం ఉద్యమం నడిపి
మానవత్వం, సంస్కరణాభిలాష
నిజాయితీ, నిబద్ధత జీవిత రథచక్రాలై
ముందుకు నడిచిన మహోన్నతుడు
వెన్నెల్లా వచ్చి
వసంతంలా వ్యాపించి
శిశిరంలా ఆకురాల్చి నిర్గమించినా
ప్రజల కోసం జీవించి
ప్రగతి కోపం తపించి
యాసను, భాషను పరిపుష్టం చేసి
తరతరాలకు నిలుస్తున్నాడు దారి దీపమై.”
పై కవితలో చక్కగా ప్రాసలకు పదును పెట్టి, భావానికి లంకె పెట్టి
అర్ధానికి ఆయువు పోసి వట్టి కోటపై గట్టి కవితను సంధించాడు. వట్టికోట అల్వారు స్వామి బతుకు చిత్రాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరెస్టుపై నిలబెట్టాడు. కవి ఏ వస్తువునైనా అందమైన కవనంగా మలిచే పటిమ, సమర్ధత, అక్షరాల కూర్పు ఉందని స్పష్టంగా బోధ పడుతుంది. అదే విధంగా ”కాళోజీ – యాదిలో” అనే కవితలో
”అన్యాయాన్ని ఎదిరిస్తే
నా గొడవకు సంతప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్ని ఎదిరించినవాడే
నాకు ఆరాధ్యుడంటూ
ఉద్యమమే ఊపిరిగా
జీవించిన సమాజ శ్రేయోభిలాషి”
అని కాళోజీ అంతరంగాన్ని ఆవిష్కరించారు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని, అన్యాయపు సంకెళ్లపై ఉక్కుపాదాన్ని మోపి, నిజాం నిరంకుశత్వంపై నిప్పు రవ్వై ఎగిసిపడిన కలం యోధుడి పోరాట పటిమను చక్కగా కాన్వాసుపై చిత్రీకరించారు ఆకుల. సంపుటి మొత్తం మీద కవనాల సుగంధ పరిమళాలతో, సౌందర్య సుందరంతో దేశభక్తి పరవశించి నట్లుగా, ప్రకతి ఒడిలో ఓలలాడినట్లుగా, పల్లె టూల్ల సోయగాలు ఉట్టిపడినట్లుగా, అమ్మ ఒడిలో పడుకొని గోరు ముద్దలు తిన్నట్లుగా మనసు సంతప్తి కడలిలో ఈదినట్లుగా ఉంది.
మానవ సంబంధాలు మసక బారుతున్న తరుణంలో ఆకుల రఘురామయ్య వారి నాయనమ్మ కీ.శే. ఆకుల లక్ష్మమ్మ, తాతయ్య కీ.శే. ఆకుల బలిజ రంగప్పలకు ఈ సంపుటిని అంకితమివ్వడమనేది గొప్పనైన, హర్షిందగ్గ విషయం. పి.విజయబాబు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు, కవి, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ రాసిన ముందు మాటలు ఈ పుస్తకాన్ని పాఠకుల చేత అసాంతం చదివిస్తాయి.
– తాటిపాముల రమేశ్ (తార),
7981566031