
నవతెలంగాణ-రాయపోల్ : కవి రచయిత శాంతి శిఖరం సాహితీ శిఖరం బోయి విజయభారతి మృతి సాహితీ లోకానికి తెలుగు ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. ఆదివారం బోయ విజయభారతి భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నేలపై బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని, మహాత్మ పూలే సంస్కరణ ఉద్యమాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారని గుర్తుచేశారు. బోధిసత్వ అంబేద్కర్, మహాత్మ పూలే జీవిత చరిత్రలను రాసి సమాజానికి స్ఫూర్తిని నింపిన మహనీయురాలు విజయభారతి అని ఆయన పేర్కొన్నారు. దళిత బహుజన వర్గాలకు నిరంతరం నిఘంటువులా పనిచేసిన వాళ్లలో ప్రథమురాలిగా బోయి విజయభారతి నిలుస్తుందని అన్నారు. 1967 లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు శాఖలో పీహెచ్డి పట్టా పొందిన రెండో మహిళగా చరిత్ర సృష్టించారని తెలియజేశారు. నిజామాబాద్ గిరిరాజా కాలేజీలో తెలుగు శాఖ అధ్యక్షురాలిగా సుమారు దశాబ్దం పైగానే ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారని గుర్తు చేశారు. బహుజన సాహిత్యంలో పరిశోధన ఒకవైపు, మరోవైపు అస్పృశ్యత, కుల వివక్షతల పై విమర్శనాత్మకంగా తను రచనలు కొనసంగించారని పేర్కొన్నారు.డాక్టర్ బోయి విజయభారతి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కొప్పుల రాజు, దాన కిషోర్, మహబూబ్ నగర్ కలెక్టర్ బోయి విజయేంద్ర, దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ, ప్రొఫెసర్ సుధారాణి, ఆఫీసర్స్ ఫోరం కన్వీనర్ సిదోజి రావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్, సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, డాక్టర్ అరుణ, పలువురు అధికారులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.