కాసుల వర్షానికి కేరాఫ్ సంక్రాంతి సీజన్.. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన
ఈ సినిమాలు ఈసారి ఎటువంటి బెనిఫిట్ షోలు, అధిక టికెట్ ధరలు లేకుండానే పోటీకి సై.. అనడం విశేషం.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ నూతన ఏడాదిలో కూడా సంక్రాంతి పోటీ రసవత్తరంగానే ఉండనుంది. భారీ అంచనాలు ఉన్న ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతున్నాయి. అలాగే ఓ అగ్రహీరో నటించిన తమిళ సినిమా కూడా ఈ సంక్రాంతి బరికి సై..అంటోంది.
ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుదల ఉండవని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అధిక ధరలతో టికెట్లు, బెనిఫిట్ షోల వల్ల మొదటి మూడు రోజుల్లోనే అనూహ్య రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టొచ్చు. ‘పుష్ప2: ది రూల్’ సినిమా సాధించిన కలెక్షన్లలో ఇవే కీలక పాత్ర పోషించాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న బెనిఫిట్ షోలు, అధిక టికెట్ ధరల పెంపు వెసులబాటు లేకపోవడం నిర్మాతల పాలిట శాపంగా మారితే, డిస్ట్రిబ్యూటర్లుకు, ఎగ్జిబిటర్లకు వరంగా మారింది.
ఇక సంక్రాంతి బరిలోకి ముందుగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో ఈనెల 10న దిగబోతున్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్‌చరణ్ ద్విపాత్రాభియంతో అలరించబోతున్నారు. బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫోర్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ఇందులో బాలకృష్ణ సైతం భిన్న పాత్రలతో కనువిందు చేయనున్నారు.
అలాగే ఈనెల14న వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మీనాక్షిచౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించిన ఈచిత్రానికి అనిల్‌రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. వీటితోపాటు అజిత్ నటించిన ‘విదాముయర్చి’ తెలుగు వెర్షన్ కూడా సంక్రాంతి బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనుంది.