ఉచిత ఆర్టీసీ బస్సుకు ”సై సై” ఉచిత ప్రభుత్వ విద్యకు ‘నై’

– తల్లిదండ్రులదా? ప్రభుత్వాన్నిదా? ఉపాధ్యాయులదా?
– ఎవరిదీ ఈ వైఫల్యం?

– ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లీష్‌ మీడియం బోధన
– అయినా తగ్గుతున్న చేరికలు
నవతెలంగాణ-బోనకల్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో మహిళలందరూ బస్సులలోనే ప్రయాణం ఉచితంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలలో కూడా ప్రభుత్వం ఉచితంగానే అన్ని సౌకర్యాలతో విద్య అందిస్తోంది. కానీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడం లేదు. ఇందులో వైఫల్యం తల్లిదండ్రులదా? ప్రభుత్వానిదా? ఉపాధ్యాయులదా? అనేది ప్రతి ఒక్కరం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని 100కు 100 శాతం వినియోగించుకుంటున్న మహిళలు, ఉచిత విద్యను ఎందుకు వినియోగించుకోవడం లేదనేది సమాధానం లేని బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులందరూ శిక్షణ పూర్తి చేసుకొని పూర్తి సామర్థ్యంతో విద్యా బోధన చేస్తున్నారు. ఏ స్థాయి విద్యార్థికి ఏవిధంగా విద్యాబోధన చేయాలనేది శిక్షణ పూర్తి చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను దాదాపు కల్పించుకుంటూ వస్తుంది. ప్రభుత్వ విద్యకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం, పాఠ్యపుస్తకాలను, మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తుంది. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించకుండా ప్రయివేటు పాఠశాలలకే ఎందుకు పంపిస్తున్నారు. ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను ప్రభుత్వం అందిస్తుండగా లక్షలాది రూపాయలు ప్రైవేటు పాఠశాలలకు దార పోసి ‘బట్టి’ చదువులు చదివిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదవటమే ఒక హౌదాగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే చిన్నచూపుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన చేసే చాలామంది ఉపాధ్యాయులకు బోధన అర్హత లేకపోయినా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ఆ పాఠశాలలకే పంపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కనీస అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించి తక్కువ జీతాలతో కాలం గడుపుతున్నాయి. ప్రజల కోసం పాలకులు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ విద్య విషయానికి వస్తే మాత్రం ఆసక్తి చూపటం లేదు.
ఉదయం తల్లిదండ్రులు తమ పిల్లలను నున్నగా తలదువ్వి, అలంకరణ చేసి ప్రైవేటు పాఠశాల బస్సులో పంపించి, మరల అదే బస్సులో సాయంత్రం తల చెరగకుండా ఇంటికి వస్తే బాగా చదివినట్లేనని భావిస్తున్నారా? ప్రైవేటు పాఠశాలల్లో వివిధ రకాల ఫీజులతో మోత మోగిస్తున్న అర్హత లేని చదువుల కోసం తల్లిదండ్రులు ఎందుకు ఆరాటపడుతున్నారు. అది ఒక హౌదాగా భావిస్తున్నారా లేక ప్రభుత్వ పాఠశాలల అంటే చిన్న చూపా? అనేది తల్లిదండ్రులే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తుంది. కానీ ఆ ప్రచారానికి తల్లిదండ్రుల నుంచి స్పందన కరువై బడిబాటకు వెళ్లిన ఉపాధ్యాయులకు భంగపాటే ఎదురవుతుంది. గతంలో కేవలం తెలుగు మీడియం మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నారని, అందువలనే తాము ఇంగ్లీష్‌ చదువుల కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు సమాధానం చెప్పేవారు. కానీ గత కొన్ని ఏళ్లుగా తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులే ఇంగ్లీష్‌ మీడియం బోధన చేస్తున్నారు. అయినా తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన జరుగుతున్న ప్రయివేటు పాఠశాలల వైపు తల్లిదండ్రులు ఎందుకు పరుగులు పెడుతున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సును, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్న ప్రజలు ఉచిత విద్యను ఎందుకు పూర్తిగా వినియోగించుకోవడం లేదో ప్రభుత్వం, మేధావులు, విద్యావంతులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చర్చ పెట్టి పరిష్కారం మార్గం చూపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యను కాపాడవలసిన అవసరం ఉంది.
ఇలాగే కొనసాగితే ప్రభుత్వ బడుల భవితవ్యం ప్రశ్నార్ధకమేనా?
కార్పొరేట్‌ పాఠశాలల్లో చదవడం హౌదాగా భావించి చేరికలు ఇలాగే కొనసాగితే మున్ముందు ప్రభుత్వ బడుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనున్నది. ఇన్నాళ్లు సామాన్యుడికి చేరువైన చదువు దూరమై జీవితాలు భారంగా మారే అవకాశం ఉంది. పాఠశాలలో కొన్నాళ్ల క్రితం మూడు అంకెలలో ఉండే చేరికలు ప్రస్తుతం రెండు అంకెల సంఖ్య దాటడం లేదు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారనే విషయాన్ని మరిచిన తల్లిదండ్రులు ఆ ముళ్ళ దారిని పూలదారిగా భావిస్తూ ప్రభుత్వ పాఠశాలల చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు.