గాంజా శంకర్‌గా సాయి తేజ్‌

సాయి తేజ్‌ త్వరలో ‘గాంజా శంకర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంపత్‌ నంది రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచాన్ని, గాంజా శంకర్‌ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ని సాయితేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
నాయకుడి పాత్ర తన శత్రువులపై ‘మాస్‌ దాడి’ని ప్రారంభించ బోతోందని, నిద్రపోయే ముందు సూపర్‌ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా దర్శకుడు ఈ కథను వెల్లడించడం విశేషం.
తన సజనాత్మకతో సంపత్‌ నంది ఈ సినిమాపై అంచ నాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటిదాకా పూర్తి మాస్‌ పాత్రతో రాలేదు. మొదటి సారి ఆయన ఈ తరహా పాత్ర పోషిస్తున్నారు. ‘గాంజా శంకర్‌’ తో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాస్‌ నిర్వచనం ఇవ్వబోతున్నారని మేకర్స్‌ తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘మ్యాడ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత భీమ్స్‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్‌.ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. రిషి పంజాబీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
సైనికులకు, పోలీసులకు రూ. 20 లక్షలు విరాళం
1986 అక్టోబర్‌ 15న జన్మించిన సాయిధరమ్‌ తేజ్‌కి ఆదివారంతో 36 ఏళ్ళు నిండాయి. ఈ నేపథ్యంలో సమాజం, అలాగే మన భద్రత కోసం పోరాడే పౌరుల క్షేమం కోసం విరాళాలు ఇవ్వడం విశేషం. భారత సైన్యం కోసం 10 లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీలకు చెరొక 5 లక్షలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసుని చాటుకున్నారు సాయితేజ్‌.