బీసీసీఐ కార్యదర్శిగా సైకియ

Saikia as BCCI secretary– కోశాధికారిగా ప్రభుతేజ్‌ సింగ్‌ ఎన్నిక
ముంబయి : బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్‌ సైకియ, కోశాధికారిగా ప్రభుతేజ్‌ సింగ్‌ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ముంబయిలో జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఎం) అనంతరం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగిన జై షా ఐసీసీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. కోశాధికారిగా ఉన్న వ్యక్తి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరారు. దీంతో ఈ రెండు పదవులకు ఖాళీ ఏర్పడగా.. ఎస్‌జీఎంలో నూతన ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకున్నారు. దేవజిత్‌ సైకియకు తాత్కాలిక కార్యదర్శి బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ప్రతినిధిగా ఎస్‌జీఎంకు హాజరైన అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు నూతన కార్యదర్శి, కోశాధికారులను అభినందించారు. తెలంగాణలో క్రికెట్‌ అభివృద్దికి సహకారం అందించాలని కోరారు.