కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా సైంధవ్‌

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా సైంధవ్‌వెంకటేష్‌ నటించిన తన 75వ చిత్రం ‘సైంధవ్‌’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వైజాగ్‌లో నిర్వహించిన ‘సైంధవ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. వెంకటేష్‌ మాట్లాడుతూ, ‘నా తొలి సినిమా నుంచీ వైజాగ్‌తో అనుబంధం ఉంది. కలియుగ పాండవులు, సుందరకాండ, మల్లీశ్వరి. సీతమ్మ వాకిట్లో, గోపాలగోపాల ఇలా చాలా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ‘సైంధవ్‌’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రంగా న్యూ ఏజ్‌ యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సైంధవ్‌’ని తీశాం. దర్శకుడు శైలేష్‌ అద్భుతంగా ప్రజంట్‌ చేశారు. మీకు నచ్చే యాక్షన్‌ చాలా కొత్తగా చేశాను. ఇది పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది’ అని తెలిపారు. దర్శకుడు శైలేష్‌ కొలను, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, నిర్మాత వెంకట్‌ బోయినపల్లి, రామజోగయ్య శాస్త్రి తదితరులు ఈ చిత్రంలోని విశేషాలను తెలియజేశారు.