సంక్రాంతి బరిలో సైంధవ్‌

సంక్రాంతి బరిలో సైంధవ్‌వెంకటేష్‌ నటిస్తున్న తన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న అన్ని దక్షిణ భారతీయ భాషలతోపాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌తోపాటు తొలిపాటను విడుదల చేసిన మేకర్స్‌ లేటెస్ట్‌గా ‘సరదా సరదాగా..’ అంటూ సాగే రెండవ పాటను రిలీజ్‌ చేశారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీగా స్వరపరిచారు. వెంకటేష్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ మధ్య సాగే సంభాషణతో పాట ప్రారంభమై, వారి ఇద్దరి చూడచక్కని ప్రయాణాన్ని ఈ పాట చూపించింది. అలాగే సారా పోషించిన వెంకీ కుమార్తె పాత్ర సైతం అందర్నీ అలరిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం వారి మధ్య బంధాన్ని మరింత అందంగా చూపించింది. అనురాగ్‌ కులకర్ణి వాయిస్‌ ఆ పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది.