– సఖి భరోసా కేంద్రం సందర్శించిన కలెక్టర్ మను చౌదరి
నవతెలంగాణ- సిద్ధిపేటరూరల్
సఖి భరోసా కేంద్రాలు బాధితులకు అండగా నిలవాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సఖి భరోసా కేంద్రాలను సందర్శించారు. నిధులు, సిబ్బంది వివరాలు వాటి నిధులు తెలుసుకున్నారు. బాధిత మహిళలకు అండగా ఉండేలా విధులు నిర్వహించాలని అన్నారు. ఏదైనా గృహహింసకు గురైన వారు సఖి కేంద్రాన్ని సంప్రదించిన వెంటనే స్పందించి వారి వద్దకు వెళ్లి వారిని సఖి కేంద్రానికి తీసుకువచ్చి అవసరమైన సహాకారాలు అందించాలని అన్నారు. బాధితులకు, బాధ్యులను పిలిపించి విడివిడిగా, సంయుక్తంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని అవసరమైన వారికి లీగల్ సహకారం కూడా అందించాలని అన్నారు. బాధితులు ఐదు రోజులపాటు కేంద్రంలో ఉండడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని అన్నారు. కుటుంబ గొడవలు, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు తదితర మహిళా సంబంధ సమస్యలు వీటి పైన సఖి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సఖి కేంద్రం ప్రతిమను ఆదేశించారు. వీరి వెంట రూరల్ ఎస్సై అపూర్వ రెడ్డి ఉన్నారు.