జీతాలు పడ్తలే..!

Salaries are coming..!– ఐదు నెలలుగా పంచాయతీ కార్మికుల ఎదురుచూపు
– రాష్ట్రంలో 60 వేల మంది పారిశుధ్య కార్మికులు
– పెండింగ్‌లో రూ.200 కోట్లు
– వెంటనే వేతనాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్‌
కోడి కూయక ముందే పల్లె వీధులను శుభ్రం చేసి.. పరిశుభ్రంగా మార్చే పారిశుధ్య కార్మికుల బతుకులు మసకబారుతున్నాయి. కార్మికులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. అసలే వారికి వచ్చేది అరకొర వేతనం.. అది కూడా సకాలంలో అందకపోవడంతో ఆ కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయి. పస్తులుండి పనిచేస్తున్నా ప్రభుత్వం తమ పట్ల కనికరం చూపడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 60 వేల మంది పంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 52 వేల మంది ఉన్నారు. వీరికి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆరు వేల మంది పంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3,600 మంది, వికారాబాద్‌లో 2,500 మంది కార్మికులు ఉన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో ఐదు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రూ.20 కోట్లు పెండింగ్‌ ఉన్నట్టు సమాచారం.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామ పం చాయతీలో సుమారు ఐదు వేల మంది జనా భా ఉంటు ంది. ఈ గ్రామంలో 14 మంది పారి శుధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి మాత్రమే ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం అందుతోంది. ఈ ఐదుగురి వేతనం రూ.42,500 రాగా, అందులో నుంచి ఒక్కొక్కరు సుమారు రూ.మూడు వేల చొప్పున 14మంది కార్మికులు పంచుకుంటున్నారు. అరకొర వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అరకొర వేతనం కూడా ఐదు నెలలుగా అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
పస్తులుండి పనిచేస్తున్నాం పెంటయ్య, నల్లవెల్లి గ్రామ పంచాయతీ
నల్లవెల్లి గ్రామ పంచాయతీ కారోబార్‌గా పనిచేస్తున్నా. ఐదు నెలలుగా జీతం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఏమైనా ఇతర పని చేసుకుందామంటే ఎప్పుడు ఏ అధికారి వచ్చి ఫోన్‌ చేస్తాడో తెలియదు. ఇంట్లో పిల్లలకు సరైన తిండి పెట్టలేని దీనస్థితిలో బతుకుతున్నాం. ప్రభుత్వం కనికరించి సకాలంలో వేతనాలు చెల్లించాలి.
రెండు పూటలు పనిచేయాల్సిందే..
కార్మికులు కుటుంబ పోషణ కోసం ఇతర పని ఏమన్నా చేద్దామంటే.. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు అడ్డొస్తున్నాయి. ప్రతిరోజూ కార్మికులు రెండు పూటలా పనిచేయాల్సి వస్తోంది. జీయో ట్యాగింగ్‌, యాప్‌ల పేరుతో రోజుకు రెండు సార్లు పని ప్రదేశంలో ఫొటోలు తీసి పంపించాలని అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దాంతో కార్మికులు ఇతర పనులకు వెళ్లలేకపోతున్నారు. ఇతర పనులు చేసుకోలేక, చేసే పనికి జీతం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు
అరకొరగా ఇచ్చే వేతనాలను కూడా పెండింగ్‌లో పెట్టడంతో పంచాయతీ కార్మికుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. కుటుంబం గడవని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 5 నుంచి 6 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.