– విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డీఎస్సీ-2024 ద్వారా నియామకమైన నూతన ఉపాధ్యాయులకు ఈనెల పదో తేదీ నుంచే వేతనాలను చెల్లించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. వారు ఈనెల 10,11 తేదీల్లో డీఈవో కార్యాలయాల్లో రిపోర్టు చేశారని పేర్కొన్నారు. వారికి 16న కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామని వివరించారు. అయితే వారు విధుల్లో చేరిన ఈనెల పదో తేదీ నుంచే వేతనాలను మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేశారు. డీఈవోలు, ఎంఈవోలు, క్లస్టర్ హెడ్మాస్టర్లు, హెడ్మాస్టర్లు ఈ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు.