వేతన వెతలు.. మూడు నెలలుగా జీతాలు లేవు

– నలుగుతున్న శానిటేషన్ సిబ్బంది
– మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె
– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అసలే అరకొర జీతాలు.. అవి కూడా సమయానికి అందకపోతే వారి అవస్థలు వర్ణనాతీతం. నెల వచ్చేసరికి ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజు, వీటితోపాటు నెలవారి ఖర్చులు పలకరిస్తూ ఉంటాయి. ఇక ఈఎంఐ విషయానికి వస్తే ఈఎంఐ లు చెల్లించాలని రెండు రోజుల ముందుగానే మెసేజ్లు వస్తుంటాయి. లేదంటే పైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది. ప్రతినెల జీతం వస్తుందనే ప్రణాళికతో ముందుకు పోతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పాతవి రెండు.. కొత్తవి మూడు
నల్లగొండ జిల్లాలోని మెడికల్ కళాశాలలో వివిధ పనుల నిమిత్తం సుమారు 35 మంది శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరికి గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది చేసేదేమీ లేక సమ్మె బాట పట్టారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట గురువారం చేపట్టిన సమ్మె శనివారానికి మూడవ రోజుకు చేరుకుంది. వేతనాలు అందక కుటుంబాలకు గడవడం కష్టంగా మారిందని వారంతా తీవ్ర అవేన వ్యక్తం చేస్తున్నారు. గతంలోని  ఏజెన్సీ నిర్వాహకులు రెండు నెలల వేతనాన్ని నేటికీ చెల్లించలేదు. ఇటీవలే నూతన ఏజెన్సీ బాధ్యతలను తీసుకున్న ఏజెన్సీ నివాహకులు కూడా గత మూడు మాసాలుగా వేతనాలను  చెల్లించలేదు. మెడికల్ కళాశాల అధికారులు విషయంపై స్పందించి వెంటనే వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలను పూర్తిస్థాయిలో చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
తక్షణమే వేతనాలు చెల్లించాలి: ఏ. రాజు (సెక్యూరిటీ గార్డ్ మెడికల్ కళాశాల నల్లగొండ)
పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలో సిబ్బందికి చెల్లిస్తున్న 15,600 రూపాయలను చెల్లించాలి. ఈఎస్ఐ, పిఎఫ్ గతంలో 500 నుండి 600 చెల్లించేది. కొంతకాలంగా అది కూడా చెల్లించడం లేదు. మాకు ఏమి తెలియనియడం  లేదు. ఏజెన్సీ నిర్వాహకులు, ఆస్పత్రి యాజమాన్యం వారు చూస్తూ పోతున్నారే తప్ప ఏది పట్టించుకోవడం లేదు. మాకు ఎ విషయాన్ని చెప్పడం లేదు.
రెన్యువల్ కాకపోవడం వల్ల ఆలస్యం..
విషయంపై సంబంధిత శాఖ అధికారిని వివరణ కోరగా సిబ్బంది కాలపరిమితి గడువు మార్చి నెల కె ముగిసిందని, రెన్యువల్ కావడం ఆలస్యం కావడంతో ఏజెన్సీ నిర్వాహకులు వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఈఎస్ఐ, పిఎఫ్  కూడా చెల్లించారు. అలా చెల్లించకుండా వేతనాలు వేసే అవకాశం ఉండదు. అది అవాస్తవం.