అంగన్‌వాడీల వేతనాలు వెంటనే ఇవ్వాలి

అంగన్‌వాడీల వేతనాలు వెంటనే ఇవ్వాలి– సమస్యలు పరిష్కరించండి :అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సునీత
– ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లిం చాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత డిమాండ్‌ చేశారు. సోమవారం అంగన్‌ వాడీలు ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలి పారు. అంతకు ముందు సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 4 వరకు 24 రోజులు రాష్ట్రవ్యాప్తం గా నిరవధిక సమ్మె చేశామని గుర్తు చేశారు. జేఏసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వంతో నాటి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఐసీడీఎస్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌తో చర్చలు జరిగాయన్నారు. అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం నిరవధిక సమ్మె 2023 అక్టోబర్‌ 4న విరమించా మన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేస్తుందని అనుకున్నామని, కానీ 3 నెలలు అవుతున్నా ఇప్పటీవరకు జీతాలు ఇవ్వలేదన్నారు. వేతనాలు లేక కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి అంగన్‌వాడీల పెండింగ్‌ వేతనాలు వెంటనే ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు.
ఇతర జిల్లాల్లో మినీ అంగన్‌వాడీల ను మెయిన్‌ అంగన్‌వాడీలుగా ఆర్డర్‌ కాపీలు ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పటివరకు ఆదిలాబాద్‌ జిల్లాలో మినీ అంగన్‌వాడీలకు ఆర్డర్‌ కాపీలు ఇవ్వలేదన్నారు. పదో తరగతి చదివిన ఆయాలకు టీచర్‌ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని, మే నెలలో ఎండాకాలం సెలవులు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఇతర డిమాండ్లన్నిం టినీ పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రజావాణి విభాగంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, జిల్లా కమిటీ సభ్యులు అగ్గిమల్ల స్వామి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.వెంక టమ్మ, యూనియన్‌ జిల్లా కోశాధికారి పి.రత్నమాల, జిల్లా నాయకులు డి.సునీత, సుభద్ర, ముక్తా, సుభద్ర, కౌసల్య, రాధా, డి.శకుంతల, పంచపూల, పద్మ, రాదమ్మ, కళావతి, పద్మ పాల్గొన్నారు.