– ఎమ్మెల్యే తెల్లంకి వినతి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది శానిటేషన్ సెక్యూరిటీ, పేషంట్ కేర్ వివిధ విభాగాల్లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అందరూ కలిసి ఆదివారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. గత మూడు నెలలుగా వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత నెల 10వ తేదీన హాస్పటల్ ఎదుట ధర్నా చేసినప్పుడు ఎమ్మెల్యే తెల్లం వేతనాలు ఇప్పించే దానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందున అట్టి హామీని నెరవేర్చాలని వినతి ఇచ్చినట్టు వారు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… జూలై 8న ఏరియా హాస్పిటల్ పాలకమండలి సమావేశం నిర్వహించి కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకుంటామని, ఆ కాంట్రాక్టర్‌ని టెర్మినేట్ చేయిస్తామని, వేరే కొత్త కాంట్రాక్టర్‌కి ఇచ్చి తక్షణమే జీతాలు వచ్చేదానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ….
భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ప్రతినెల వేతనాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, నాలుగు, ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవటం వలన వారికి సరైన అప్పులు కూడా పుట్టగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విధానం సరైనది కాదని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మారకపోవడం వలన కార్మికులు ఇబ్బందులు తప్పటం లేదన్నారు. ఇప్పటికైనా తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వారి వేతనాలు వెంటనే రిలీజ్ చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గడ్డం స్వామి, జి.లక్ష్మణ్, ఎన్.నాగరాజు, రమా, నరసింహారావు, రమేష్, నరేంద్ర, రమణ, మమత, తదితరులు పాల్గొన్నారు.