
బంధాల ఏజెన్సీలో విస్తృత పర్యటన
నవతెలంగాణ – తాడ్వాయి
దట్టమైన అడవి ప్రాంతం లోని బంధాల ఏజెన్సీ లో ఏర్పాటు చేసిన కంటైనర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(టిఏజిఎస్) ములుగు జిల్లా అధ్యక్షులు దిగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బంధాల, లింగాల ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా పోచపూర్ లోని కంటైనర్ హాస్పిటల్ ని సందర్శించారు. కంటైనర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం జూలై 14, 2024న పంచాయతీ రాజ్ గ్రామీణావృధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఏజెన్సీలోని ఆదివాసులకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి కంటైనర్ హాస్పిటల్ ను ప్రారంభించారని, కానీ అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు ఏడు నెలల నుండి అందులో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వకుండా, తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కంటైనర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఏజెన్సీలో కంటైనర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పోఛాపూర్ లోని కంటైనర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వాలని, లేదంటే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు.