1న జీతాలు పడ్డాయ్‌

Salaries were paid on 1stనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ నాలుగేండ్ల తర్వాత ఒకటో తారీకున జీతాలు పడ్డాయి. పెన్షనర్లకు పింఛన్‌ జమ అయ్యింది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాల వారీగా జీతాలు జమయ్యేవి. అది కూడా ఒకటో వారం నుంచి మూడో వారం వరకు ఆలస్యంగా వచ్చేవి. కొన్ని జిల్లాల్లోని కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగులకు నెలాఖరున జీతాలు జమయ్యే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు జీతాల చెల్లింపులో మార్పు వచ్చింది. ఫిబ్రవరి జీతాలను మార్చి ఒకటిన చెల్లించడం గమనార్హం. డిసెంబర్‌ జీతాలను జనవరి ఆరు, జనవరి జీతాలను ఫిబ్రవరి ఏడు తేదీల్లో జమ చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో గతేడాది జనవరి 13న, ఫిబ్రవరి 13న, మార్చి 13న చెల్లించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం జనవరి ఆరున, ఫిబ్రవరి ఏడున, మార్చి ఒకటిన జీతాలు చెల్లించింది. బీఆర్‌ఎస్‌ హయాంలో గతేడాది నవంబర్‌ 13న నాటి ప్రభుత్వం జీతాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో డిసెంబర్‌ ఏడున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆ నెలలో 15న జీతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆలస్యంగా జీతాలు ఇచ్చే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. ఫిబ్రవరి జీతాలను ఒకటో తేదీన చెల్లించడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలోని 3,69,200 మంది ఉద్యోగులకు జీతాలు, 2,88,000 మంది పెన్షనర్లకు పింఛన్‌ చెల్లించింది. 2019, అక్టోంబర్‌ ఒకటో తేదీన చివరిసారిగా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్‌ జమ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకటో తేదీన జీతాలివ్వడం ఇప్పుడే కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలివ్వడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రకటించాయి. ఇదే పద్ధతిని ప్రతినెలా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఉద్యోగుల్లో ఆందోళన పోయి…ఆనందం
ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు రాకపోవడంతో ఇంతకాలం ఉద్యోగులు ఎంతో ఆందోళన చెందారు. ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న ఇంటి రుణం, విద్యారుణం, వ్యక్తిగత రుణం, వాహన రుణాలకు సంబంధించి ఐదో తేదీలోపు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కిరాయి ఇండ్లలో ఉండే వారు అయితే ఇంటి అద్దె కట్టాలి. పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, కిరాణా బిల్లు ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం సకాలంలో జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉండేది. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు చెల్లించేందుకు కొందరు అప్పులు చేసేవారు. సిబిల్‌ స్కోర్‌ తగ్గడంతో కొత్తగా ఎవరైనా రుణం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. బ్యాంకులు ఇచ్చేందుకు నిరాకరించేవి. అందుకే ఒకటో తేదీన జీతాలివ్వాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్‌ చేశాయి. అయినా ఇవ్వలేదు. అధికారంలోకి వస్తే ఒకటో తేదీన జీతాలిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీన జీతాలు చెల్లించింది.
ఇదే ఒరవడి ప్రతినెలా కొనసాగించాలి : టీఎస్‌యూటీఎఫ్‌
మొదటి తేదీన జీతాలు చెల్లించే ఒరవడిని ప్రతినెలా కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ఒకటో తేదీన జీతాలను జమ చేయడం హర్షణీయమని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి వేతనాలను ఫిబ్రవరి రెండు, మూడు తేదీల్లో చెల్లించారని పేర్కొన్నారు. ఫిబ్రవరి జీతాలను మార్చి ఒకటిన జమ చేయడం సానుకూల అంశమని వివరించారు. అదే విధంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది రెండేండ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, పీఆర్సీ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షన్‌ తదితర బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2022, జులై నుంచి గతేడాది జనవరి, జులై మూడు వాయిదాల కరువు భత్యం (డీఏ) పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వెంటనే మూడు విడతల డీఏను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని సూచించారు. రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తోడ్పడాలని కోరారు. కార్పొరేట్‌ విద్యావ్యాపారాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. పిల్లలందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు : టీఎన్జీవో
ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు చెల్లించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు ధన్యవాదాలు పేర్కొన్నారు.
హర్షణీయం : టీఎస్‌సీపీఎస్‌ఈయూ
రాష్ట్రంలో ఒకటో తేదీన జీతాలు రావడం హర్షణీయమని టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలను జమ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.