ఎన్నికల సమయంలోనూ బాండ్ల విక్రయం

 Sale of bonds even during elections– చట్టానికి సవరణ చేసిన మోడీ ప్రభుత్వం
ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌తో సంబంధమున్న పలు సంస్థలు 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. అంతేకాదు… 2022లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలకు ఎన్నికలు జరగడానికి ముందు కూడా బాండ్ల కొనుగోళ్లు జరిగాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో బాండ్లను విక్రయించకూడదు. అయితే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ కారణంగా అందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా కమలదళానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి.
ఎన్నికల సమయంలో విక్రయించిన బాండ్లలో అధిక భాగం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖాతాకే చేరాయి. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి జాబితాలో అనేక బడా దేశీయ కంపెనీల పేర్లు కన్పించడం లేదు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారాన్ని ప్రాథమికంగా పరిశీలించినప్పుడు అదానీ, టాటా గ్రూప్‌ కంపెనీలు బాండ్లను కొనుగోలు చేసిన సమాచారం లేదు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కూడా బాండ్లను నేరుగా కొనలేదు. అయితే ఆ గ్రూపుతో సంబంధమున్న సంస్థల పేర్లు కొనుగోలు దారుల జాబితాలో ఉన్నాయి. వీటన్నింటికీ ఉమ్మడి డైరెక్టర్లు ఉన్నారు. వాటి చిరునామాలు కూడా ఒకటే. భారీగా కొనుగోళ్లు చేసిన రిలయన్స్‌ అనుబంధ సంస్థలు ఫలితంగా బీజేపీకి భారీ విరాళాలు
న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండిస్టీస్‌తో సంబంధమున్న సంస్థలలో క్విక్‌ సప్లరు చెయిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒకటి. ఇది రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని గతంలోనే పలు స్వతంత్ర మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన తపస్‌ మిత్రా రిలయన్స్‌ ఆయిల్‌ అండ్‌ పెట్రోలియం, రిలయన్స్‌ ఎరోస్‌ ప్రొడక్షన్‌, రిలయన్స్‌ ఫొటో ఫిల్మ్స్‌, రిలయన్స్‌ ఫైర్‌ బ్రిగేడ్‌, రిలయన్స్‌ పాలియస్టర్‌ సంస్థలకు కూడా డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అకౌంట్స్‌ (కన్సాలిడేషన్‌) విభాగానికి ఆయనే అధిపతి.
అంబానీ మాజీ భాగస్వామి కూడా…
ముకేష్‌ అంబానీకి ఒకప్పటి వ్యాపార భాగస్వామి సురేంద్ర లూనియాతో సంబంధమున్న సంస్థలు కూడా బాండ్లను కొనుగోలు చేశాయి. రిలయన్స్‌ అనుబంధ సంస్థలకు ఎన్డీటీవీలో ఉన్న 29.18% వాటాలను ఆయన అదానీ గ్రూపుకు విక్రయించారు. లూనియాతో సంబంధమున్న ఎన్స్‌జ్‌ డివైసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇన్ఫోటెల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు బాండ్లను కొనుగోలు చేశాయి. ఈ రెండు కంపెనీల బోర్డు సమావేశాలకు లూనియా హాజరవుతుంటారు. ఇక లూనియాకు ఇన్ఫోటెల్‌ యాక్సెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఇన్ఫోటెల్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలతో సంబంధం ఉంది. వాటి డైరెక్టర్‌ కమల్‌ కుమార్‌ శర్మ ద్వారా లూనియాకు ఈ కంపెనీలతో సంబంధం ఏర్పడింది. లూనియాస్‌ ఇన్ఫోటెల్‌ గ్రూపుకు కమల్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ కలిసి 2019 మే 9న రూ.50 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఆ సమయంలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల వేళ బాండ్ల విక్రయం
సాధారణంగా ఎన్నికల బాండ్లను సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే విక్రయిస్తారు. లోక్‌సభ ఎన్నికలు జరిగే సంవత్సరంలో వీటిని అమ్మకూడదు. అయితే ఎన్నికలు జరిగే సంవత్సరంలోనూ పదిహేను రోజుల పాటు బాండ్లను విక్రయించేందుకు వీలుగా 2022 నవంబర్‌ 7న మోడీ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ సవరణ చేయడం గమనార్హం.
సింహభాగం బీజేపీకే
చట్ట సవరణ నేపథ్యంలో 2022 నవంబర్‌ 9 నుంచి వారం రోజుల పాటు బాండ్లను అమ్మారు. ఈ వ్యవధిలోనే రూ.676 కోట్ల విలువైన బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. ఇందులో బీజేపీకి రూ.590 కోట్లు (87 శాతం) విరాళాల రూపంలో అందాయి. ఈ దశలో రిలయన్స్‌తో సంబంధమున్న సంస్థలే ఎక్కువగా బాండ్లను కొనుగోలు చేశాయి. ఈ వారం రోజుల వ్యవధిలో క్విక్‌ సప్లరు చెయిన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, నెక్స్‌జ్‌ డివైసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాన్‌కైండ్‌ ఫార్మా లిమిటెడ్‌లు రూ.164 కోట్ల (మొత్తం విక్రయాలలో 24 శాతం) బాండ్లు కొన్నాయి. మాన్‌కైండ్‌ ఫార్మాలో లూనియా కూడా ఒక డైరెక్టరే. లూనియాతో సంబంధం ఉన్న మరో సంస్థ ఎంఎన్‌ మీడియా వెంచర్స్‌ ఈ వారం రోజుల అమ్మకపు కాలంలో రూ.5 కోట్ల విలువైన బాండ్లు కొన్నది. దీనికి, నెక్స్‌జ్‌ డివైసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సందీప్‌ జైరాథ్‌ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఎంఎన్‌ మీడియా వెంచర్స్‌లో రెండో డైరెక్టర్‌గా ఉన్న కుల్విందర్‌ పాల్‌ సింగ్‌ ఇన్ఫోటెల్‌ గ్రూపు (లూనియాకు చెందిన కంపెనీ)కు సీనియర్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
టెండర్‌ దక్కించుకున్న రిలయన్స్‌
స్థానికంగా బ్యాటరీ సెల్స్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం 2.4 బిలియన్‌ డాలర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రోత్సాహకాలు పొందేందుకు రియలన్స్‌ గ్రూప్‌ బిడ్‌ సమర్పించింది. 2022 మార్చిలో టెండర్‌ దక్కించుకుంది. రిలయన్స్‌తో సంబంధమున్న మరో కంపెనీ హానీవెల్‌ ప్రాపర్టీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ 2021 ఏప్రిల్‌ 8న రూ.30 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు 2005 నుంచి అనేక రిలయన్స్‌ గ్రూపు సంస్థల బోర్డుల్లో ఉన్నారు.
రెండోసారి కూడా…
సవరణ ద్వారా బాండ్లను విక్రయించిన కాలంలో రిలయన్స్‌ గ్రూపుతో పాటు వేదాంత గ్రూపు, యునైటెడ్‌ ఫాస్ఫరస్‌, శ్రీ సిద్ధార్ధ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ అండ్‌ సర్వీసెస్‌, డీఎల్‌ఎఫ్‌, సిప్లా, మారుతి సుజికీ కూడా పెద్ద మొత్తంలోనే కొనుగోళ్లు జరిపాయి. గుజరాత్‌ ఎన్నికలకు ముందు 2022 డిసెంబరులో మరోసారి బాండ్ల విక్రయానికి గేట్లు తెరిచారు. ఈ కాలంలో రూ.232 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడుపోయాయి. వీటిలో కూడా సింహభాగం బీజేపీదే. ఆ పార్టీకి రూ.165 కోట్ల విరాళాలు అందాయి. క్విక్‌ సప్లరు రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అందులో 2022 జనవరి 5న రూ.225 కోట్లు, జనవరి 10న రూ.10 కోట్ల విలువైన బాండ్లు కొన్నది.