6 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం

– కేంద్రంగ్రీన్‌ సిగల్‌
న్యూఢిల్లీ :
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 29వ విడత ఎన్నికల బాండ్ల విక్రయాలను నవంబరు 6 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన 29 శాఖల్లో నవంబరు 6 నుంచి 20 వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్‌, కోల్‌కతా, గువహతి, చెన్నై, పాట్నా, ఢిల్లీ, చండీగఢ్‌, శ్రీనగర్‌, గాంధీనగర్‌, భోపాల్‌, రాయపూర్‌, ముంబయి నగరాల్లోని ఎస్‌బీఐ శాఖల్లో ఎన్నికల బాండ్లను విక్రయించనున్నారు.
నవంబరు 7 నుంచి 30 వరకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఒక రోజు ముందు ఎన్నికల బాండ్ల విక్రయాలు ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2018 మార్చి నుంచి నిర్ణీత కాల వ్యవధుల్లో ఇప్పటి వరకూ 28 విడతల్లో ఎన్నికల బాండ్లను ఎస్‌బీఐ ద్వారా విక్రయించారు. తాజాగా 29వ విడత విక్రయాలకు కేంద్రం అనుమతినిచ్చింది.అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చాలని భావించే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. గడువు తేదీ ముగిసిన తర్వాత బాండ్లను జమ చేసినా… ఎలాంటి నగదు జమ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఖాతాలో ఈ బాండ్లను డిపాజిట్‌ చేసిన రోజే నగదు మొత్తం జమ అవుతుంది. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఒకశాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందే అర్హత ఉంటుంది.