సాల్ట్‌ చితక్కొట్టాడు

సాల్ట్‌ చితక్కొట్టాడు కోల్‌కత చేతిలో లక్నో చిత్తు
– ఫిల్‌ సాల్ట్‌ అజేయ అర్థ సెంచరీ
– రాణించిన మిచెల్‌ స్టార్క్‌, నరైన్‌
– లక్నో 161/7, కోల్‌కత 162/2
ఈడెన్‌గార్డెన్స్‌లో నైట్‌రైడర్స్‌ ఈల వేసింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసి ఐపీఎల్‌ 17వ సీజన్లో నాల్గో విజయం నమోదు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (89 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో 162 పరుగుల ఊరించే లక్ష్యాన్ని కోల్‌కత ఊదేసింది. 15.4 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. మిచెల్‌ స్టార్క్‌ (3/28), సునీల్‌ నరైన్‌ (1/17) మ్యాజిక్‌తో తొలుత లక్నో సూపర్‌జెయింట్స్‌ 161 పరుగులకే పరిమితమైంది. బ్యాట్‌తో, బంతితో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఎదురులేని ప్రదర్శన చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఫిల్‌ సాల్ట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
నవతెలంగాణ-కోల్‌కత
ఫిల్‌ సాల్ట్‌ (89 నాటౌట్‌, 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (38 నాటౌట్‌, 38 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో రాణించగా.. 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత నైట్‌రైడర్స్‌ మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముగించింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఐదు మ్యాచుల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఇది నాల్గో విజయం కావటం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులే చేసింది. పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (3/28), స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (1/17) సూపర్‌జెయింట్స్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. నికోలస్‌ పూరన్‌ (45, 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్‌జెయింట్స్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది మూడో పరాజయం కావటం గమనార్హం.
చెలరేగిన సాల్ట్‌ : ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జట్లలో కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఒకటి. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో నైట్‌రైడర్స్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 200 పైచిలుకు లక్ష్యాలు సైతం కోల్‌కత ముందు నిలువటం లేదు!. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత ముందు లక్నో 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నైట్‌రైడర్స్‌ సహజంగానే 15.4 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. పించ్‌ హిట్టింగ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు సునీల్‌ నరైన్‌ (6), రఘువంశీ (7) నిరాశపరిచారు. ఫిల్‌ సాల్ట్‌తో కలిసి నరైన్‌ తొలి వికెట్‌కు 22 పరుగులు జోడించగా.. రఘువంశీ రెండో వికెట్‌కు 20 పరుగులు జత చేశాడు. లక్నో పేసర్‌ మోషిన్‌ ఖాన్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లతో మెరిసినా.. ఫిల్‌ సాల్ట్‌ ముందు లక్నో వ్యూహం ఫలించలేదు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (38 నాటౌట్‌)తో జతకలిసిన సాల్ట్‌ మూడో వికెట్‌కు అజేయంగా 76 బంతుల్లోనే 120 పరుగులు జోడించాడు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సాల్ట్‌ ఆ తర్వాత వేగం మరింత పెంచాడు. ఓ ఎండ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లు ఆడలేకపోయాడు. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో పెద్దగా రిస్క్‌ సైతం తీసుకోలేదు. జోరుమీదున్న సాల్ట్‌కు సహకారం అందిస్తూ స్ట్రయిక్‌ రొటేషన్‌ చేశాడు. పవర్‌ప్లేలో విశ్వరూపం చూపించిన సాల్ట్‌.. ఆ తర్వాత సైతం క్రమం తప్పకుండా బౌండరీలు బాదాడు. 160 పైచిలుకు లక్ష్యాలను కాపాడుకోవటంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రత్యక రికార్డు ఉంది. గత రెండు మ్యాచుల్లో ఆ జట్టు ఆ రికార్డును కాపాడుకోలేదు. గతి తప్పిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించారు. ఎక్స్‌ట్రాల రూపంలోనే లక్నో ఏకంగా 22 పరుగులు కోల్పోయింది. మోషిన్‌ ఖాన్‌ (2/29) మినహా సూపర్‌జెయింట్స్‌ బౌలర్లలో ఎవరూ రాణించలేదు.
ఆదుకున్న పూరన్‌ : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. క్వింటన్‌ డికాక్‌ (10), దీపక్‌ హుడా (8) పవర్‌ప్లేలోనే నిష్క్రమించారు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (39, 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదాని (29, 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) లక్నో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ మ్యాజిక్‌ ముందు తేలిపోయారు. పరుగుల వేటలో వెనుకంజ వేసిన సూపర్‌జెయింట్స్‌ ఏ దశలోనూ ప్రమాదకరంగా కనిపించలేదు. మార్కస్‌ స్టోయినిస్‌ (10) సైతం నిరాశపరచగా.. డెత్‌ ఓవర్లలో నికోలస్‌ పూరన్‌ (45) ఆదుకున్నాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో మెరిసిన పూరన్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన నైట్‌రైడర్స్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌ను 161 పరుగులకే పరిమితం చేసింది.
స్కోరు వివరాలు :
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ : డికాక్‌ (సి) నరైన్‌ (బి) అరోర 10, రాహుల్‌ (సి) రమన్‌దీప్‌ (బి) రసెల్‌ 39, దీపక్‌ హుడా (సి) రమన్‌దీప్‌ (బి) స్టార్క్‌ 8, ఆయుశ్‌ బదాని (సి) రఘువంశీ (బి) నరైన్‌ 29, స్టోయినిస్‌ (సి) సాల్ట్‌ (బి) స్టార్క్‌ 10, నికోలస్‌ పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) స్టార్క్‌ 45, కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 7, అర్షద్‌ ఖాన్‌ (బి) స్టార్క్‌ 5, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161.
వికెట్ల పతనం : 1-19, 2-39, 3-78, 4-95, 5-111, 6-155, 7-161.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 4-0-28-3, వైభవ్‌ అరోర 3-0-34-1, హర్షిత్‌ రానా 4-0-35-0, సునీల్‌ నరైన్‌ 4-0-17-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-30-1, అండ్రీ రసెల్‌ 1-0-16-1.
కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ : ఫిల్‌ సాల్ట్‌ నాటౌట్‌ 89, సునీల్‌ నరైన్‌ (సి) స్టోయినిస్‌ (బి) మోషిన్‌ ఖాన్‌ 6, రఘువంశీ (సి) రాహుల్‌ (బి) మోషిన్‌ ఖాన్‌ 7, శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 38, ఎక్స్‌ట్రాలు : 22, మొత్తం : (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-22, 2-42.
బౌలింగ్‌ : షమర్‌ జోసెఫ్‌ 4-0-47-0, మోషిన్‌ ఖాన్‌ 4-0-29-2, కృనాల్‌ పాండ్య 1-0-14-0, యశ్‌ ఠాకూర్‌ 2-0-25-0, అర్షద్‌ ఖాన్‌ 2-0-24-0, రవి బిష్ణోరు 2.4-0-17-0.