సాల్ట్‌ చితక్కొట్టాడు

సాల్ట్‌ చితక్కొట్టాడు– ఛేదనలో ఫిల్‌ సాల్ట్‌ అజేయ అర్థ సెంచరీ
– విండీస్‌పై ఇంగ్లాండ్‌ ఘన విజయం
– వెస్టిండీస్‌ 180/4, ఇంగ్లాండ్‌ 181/2
డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ దుమ్మురేపింది. గ్రూప్‌ దశలో అనూహ్య పరిస్థితులు ఎదుర్కొన్న ఇంగ్లాండ్‌ సూపర్‌8లో సూపర్‌ షో చేసింది. ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి సెమీఫైనల్‌ బెర్త్‌ దిశగా ఓ అడుగు ముందుకేసింది. ఫిల్‌ సాల్ట్‌ (87 నాటౌట్‌) ఛేదనలో అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. సాల్ట్‌ మెరుపులతో ఇంగ్లాండ్‌ అలవోక విజయం సాధించింది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన కరీబియన్లకు సూపర్‌8లో తొలి ఓటమి ఎదురైంది.
నవతెలంగాణ-గ్రాస్‌ఐలెట్‌
సూపర్‌8లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మొదలెట్టింది. ఆతిథ్య వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఇంగ్లాండ్‌..సూపర్‌8లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (87 నాటౌట్‌, 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగగా.. జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్‌, 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. జాన్సన్‌ ఛార్లెస్‌ (38, 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (36, 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రోవ్‌మాన్‌ పావెల్‌ (36, 17 బంతుల్లో 5 సిక్స్‌లు) సమిష్టిగా రాణించారు. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన ఫిల్‌ సాల్ట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
సాల్ట్‌ ధనాధన్‌ : 181 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (87 నాటౌట్‌) సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. కెప్టెన్‌ జోశ్‌ బట్లర్‌ (25)తో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఫిల్‌ సాల్ట్‌ అదే జోరు ఆఖరు వరకు చూపించాడు. జోశ్‌ బట్లర్‌ రెండు ఫోర్లతో మెరిసినా.. వికెట్‌ నిలుపుకోలేదు. పవర్‌ప్లే అనంతరం బట్లర్‌ అవుటయ్యాడు. మోయిన్‌ అలీ (13) సైతం అంచనాలను అందుకోలేదు. ఈ దశలో జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్‌) ఫిల్‌ సాల్ట్‌తో జత కలిశాడు. బెయిర్‌స్టో, సాల్ట్‌ జోడీ కరీబియన్‌ బౌలర్లను ఆటాడుకున్నారు. సాల్ట్‌ 38 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. హాఫ్‌ సెంచరీ అనంతరం సాల్ట్‌ టాప్‌ గేర్‌లోకి వెళ్లాడు. మరో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో ధనాధన్‌ మోత మోగించాడు. మరో ఎండ్‌లో ప్రమాదకర హిట్టర్‌ బెయిర్‌స్టో సైతం ఏమాత్రం తగ్గలేదు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 బంతుల్లోనే అజేయంగా 48 పరుగులు సాధించాడు. ఫిల్‌ సాల్ట్‌, బెయిర్‌స్టో జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించారు. దీంతో 17.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ లాంఛనం ముగించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ బౌలర్లలో రోమారియో షెఫర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌లు చెరో వికెట్‌ పడగొట్టారు.
సమిష్టిగా కొట్టారు : తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ సొంతగడ్డపై ఆశించిన స్కోరు చేయలేదు. 20 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయినా 180 పరుగులే చేయగల్గింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కరీబియన్‌ హిట్టర్లను కట్టడి చేశారు. స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ (1/21), పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (1/34), మోయిన్‌ అలీ (1/15) రాణించారు. విండీస్‌ ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (23, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఆరంభం అందించాడు. కానీ రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించాడు. మరో ఓపెనర్‌ జాన్సన్‌ చార్లెస్‌ (38, 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలిచినా దూకుడు చూపించలేకపోయాడు. మిడిల్‌ ఆర్డర్‌లో నికోలస్‌ పూరన్‌ (36), రోవ్‌మాన్‌ పావెల్‌ (36) సహా రూథర్‌ఫోర్డ్‌ (28 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు.