నవతెలంగాణ – ములుగు/తాడ్వాయి
విధి నిర్వహణలో కఠినంగా ఉండే కాకీలు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించేందుకు ప్రాణాలు లెక్క చేయకుండా సహాయం చేస్తారని ఈ సంఘటన రుజువు చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పట్టణానికి చెందిన రోహిత్ లాల్ (21) ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు వచ్చి చిలకలగుట్ట వెనుక భాగంలోని దయ్యాల మడుగు ప్రదేశంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్బీఐ ఇన్‌స్పెక్టర్ కిరణ్, కానిస్టేబుల్ శంకర్ ప్రాణాలకు తెగించి రెండు గంటలపాటు మృతదేహం కోసం ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు మృతుడిని గుర్తించారు. సంఘటనా స్థలానికి వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర స్వయంగా మోస్తూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు చేసిన సాహసం, సహాయం ప్రతి ఒక్కరి అభినందనలు అందుకుంది. కాగా మృతదేహాన్ని అందుకున్న బంధువులు.. పోలీస్ అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదిఏమైనా పోలీస్ అధికారుల పనితీరు, కష్ట సమయంలో చూపిన మానవత్వం అందరి మన్ననలను అందుకుంది.