ధరణి దరఖాస్తులకు మోక్షం

Salvation for Dharani applications– పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి
– మార్చి మొదటి వారం డెడ్‌లైన్‌
– పోర్టల్‌ ఏజెన్సీపై విచారణ
– రెవెన్యూ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం
– 2020 ఆర్వోఆర్‌ చట్టంలో లోపాలు
– సమగ్ర భూసర్వేతో కొత్త చిక్కులు
– రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య లోపించిన సమన్వయం
– ఫలితంగా నిషేధిత భూములు సైతం పట్టాలుగా మారుతున్నాయి
– చట్టసవరణ లేదా కొత్త ఆర్వోఆర్‌ చట్టం చేయాల్సిందే
– సీఎంకు ధరణి కమిటీ మధ్యంతర నివేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను మార్చి మొదటి వారంలోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో కలిసి ధరణి కమిటీతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు సూచనలతో సీఎంకు మధ్యంతర నివేదికను అందజేశారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలనీ, ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్‌ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా అధికారులను అప్రమత్తం చేశారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించా ల్సిన సమస్యలపై దష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో స్థానికంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని చేయాల్సిన మార్పులపై విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న కంపెనీపై సీఎం ఈ సందర్బంగా విచారణకు ఆదేశించారు. ఆ పోర్టల్‌ను విదేశీ కంపెనీకి ఎందుకప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం భద్రంగా ఉందా? రికార్డులను విదేశీ కంపెనీలకు ఇచ్చే నిబంధనలున్నాయా? అని అధికారులను ప్రశ్నించారు. బిడ్‌ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. 2018లో టెక్నికల్‌, ఫెనాన్సియల్‌ బిడ్డింగ్‌, అర్హతల ఆధారంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ డిజైన్‌ డెవెలప్‌మెంట్‌ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందనీ, తర్వాత టెర్రాసిస్‌గా అనంతరం, ఫాల్కాన్‌ ఇన్వెస్టెమెంట్‌ కంపెనీగా మారిందని అధికారులు తెలిపారు. బిడ్‌ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని సీఎం ఆరా తీశారు. భూ రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా? అని అధికారులను అడిగారు. 2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్‌ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయనీ, ధరణి పోర్టల్‌ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా? అని సీఎం రెవెన్యూ అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్ట పోయారని సీఎం అన్నారు.
కమిటీ సూచించిన మేరకు పోర్టల్‌ నిర్వహణను ప్రయివేట్‌ సంస్థ నుంచి ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ కి అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రేమండ్‌ పీటర్‌, సీసీఎల్‌ఏ అధికారి లచ్చిరెడ్డి, అడ్వకేట్‌ సునీల్‌, రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్‌ బి.మధుసూదన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధరణి కమిటీ సిఫారసులు
నెలన్నర రోజుల్లో ఏడు సార్లు సమావేశమైన కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్‌ నిర్వహణ కంపెనీలు, భూ నిపుణు లతో చర్చలు జరిపింది. క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూశాఖలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గా లను సూచించింది. ధరణిలో ఉన్న సమస్యలను రెండు కేటగిరిలుగా విభజించిన కమిటీ మధ్యంతర నివేదికలో సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను ప్రస్తావించింది. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్‌ చట్టంలోనే లోపాలున్నాయని నివేదించింది. కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన సమగ్ర భూ సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని కమిటీ సభ్యులు సీఎంకు తెలిపారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని పేర్కొంది.. 35 మాడ్యుల్స్‌ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందనీ, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతు న్నారనే విషయాన్ని కమిటీ సీఎం దష్టికి తీసుకెళ్లింది. సర్వే నెంబరు మిస్సింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ కరెక్షన్‌ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోందనీ, డిజిటల్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్‌ను ఆశ్రయించాలనీ, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దేందుకు రైతులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని కమిటీ అభిప్రాయపడింది. వీటిని కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు ప్రాధాన్యత క్రమంలో బదలాయించాలని సూచించింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయనీ, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపింది. రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని తేల్చింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని వివరించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సివిల్‌ కోర్టులతో పాటు గ్రామ స్థాయి న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలనీ, ప్రతి రెండు నెలలకోసారి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరిం చాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్వోఆర్‌ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు నివేదించారు. ప్రాథమిక నివేదికలో దాదాపు 10కి పైగా సవరణలు చేయాలని కమిటీ వివరించింది.