
టెట్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ పై చర్య తీసుకోవాలని టీవీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామా మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో టీఎస్ యుటిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమీషనర్ ను ఆ బాధ్యతలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్లో అర్థాంతరంగా నిలిచిపోయిన పదోన్నతులు కొనసాగింపుకు ఆటంకంగా ఉన్న టెట్ పై ఎన్సీటిఈ వివరణ తీసుకోవాలని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పదేపదే ప్రాతినిధ్యాలు చేసిన దరిమిలా ఫిబ్రవరిలో క్లారిఫికేషన్ కోసం లేఖ వ్రాసి రహస్యంగా ఉంచారని, ప్రధానోపాధ్యాయులకు, పనిచేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్ అవసరం లేదని పేర్కొంటూ ఏప్రిల్ 8 న వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసికాందోళనకు గురిచేయటంతో పాటు అందరినీ టెట్ కు దరఖాస్తు చేయించటం ద్వారా లక్షల రూపాయులు వృధా చేయించారని పాఠశాల విద్యా కమీషనర్ వైఖరి సరైంది కాదన్నారు . ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేత్రుత్వంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ నెల 3న జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ( ఎన్సిటిఇ ) సభ్య కార్యదర్శి కెషాంగ్ వై శర్పా తో జరిగిన సమావేశంలో పి ఎస్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదని రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్సీ కి అందజేసే వరకు రాష్ట్ర విద్యాశాఖ కమీషనర్ బయటికి వెలువరించక పోవడం, సంఘ నేతలు అడిగిన చెప్పకపోవడం శోచనీయం అన్నారు.
గత మూడు సంవత్సరాలుగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో విఫలమయ్యారని, విద్యాశాఖలో వేలాది కోర్టు కేసులు పడటానికి కమీషనర్ అసమర్థ వ్యవహార సరళే కారణమని ఆరోపించారు. కమీషనర్ ను తక్షణమే ఆ బాధ్యతలనుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్సీటిఈ నుండి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులను ఎన్నికలు ముగిసిన వెంటనే రిలీవ్ చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, సర్వీసు పర్సన్స్ ను నియమించాలని మోడల్ స్కూల్స్, గురుకులాల్లో వేసవి సెలవులు ముగిసేలోగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న నాలుగు వాయిదాల డిఎ లను విడుదల చేయాలని, గత పిఆర్సీ బకాయిలతో సహా ట్రెజరీ ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోవిందరావుపేట ప్రధాన కార్యదర్శి ఎల్ దస్రు, తాడువాయి ప్రధాన కార్యదర్శి సుతారి పాపారావు ,ఏటూరు నాగారం అధ్యక్షులు పత్తిరి కిరణ్ ,ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ కన్వీనర్ గట్టి సురేందర్, ముండ్రాతి శ్రావణ్ కుమార్, సిద్ధ బోయిన అనంతరావు తదితరులు పాల్గొన్నారు.