నింగిన సగమై నేలన సగమై
మానవ జాతి జన్మకు నీవై
నిలిచిన తల్లీ బతుకమ్మా
బతకాలి… బతకమ్మా!
ఇంటికి దీపం వెలుగే నీవై
కరుణనిండిన హృదయం నీవై
శ్రమలకు నీవే ఆశ్రయమై
కదిలేవమ్మా బతుకమ్మా
బతకాలీ… బతకమ్మా!
పుట్టినింటినీ మెట్టినింటినీ
కాచే ధైర్యం నీదమ్మా
అనుబంధాలకు ఆత్మీయతకు
నెలవైనావే బతుకమ్మా
బతకాలీ.. బతకమ్మా!
పొలాలలో పనితలాలలో
చెమటను చిందే అందం నీది
పదవులలో ప్రతిపనిలోనూ
ప్రతిభకు నీవే పేరమ్మా
బతకాలీ… బతకమ్మా
తల్లిగ చెల్లిగ ఆలిగ నీవే
జీవితమంతా ధారపోసేవు
అయినా భేదం చూపేలోకం
మారాలంటూ పోరాలమ్మా
బతకాలీ… బతకమ్మా!
అన్యాయాలూ అకృత్యాలు
నీపై జరిగే దౌర్జన్యాలూ
అంతం చేసే పంతంనీవై
శక్తివంతమై ఎదగాలీ
బతకాలీ… బతకమ్మా!
మతాల మాటున అసమానతకు
గురిచేసే ఈనాటి మనువులా
మోసపు మాటల బలికావొద్దు
చైతన్యానికె చేవవు నీవై
బతకాలీ… బతకమ్మా!
తంగెడు పూలు పేర్చే రీతిగ
మనసున బలాన్ని పేర్చాలి
పాటలు పాడే గొంతే ప్రశ్నయి
ఆటల చేతులే పిడికిళ్లయి
సమరాంగనవై బతకాలీ
బతకాలీ… బతకమ్మా!
– కె.ఆనందాచారి