సమర్థుని జీవయాత్ర

Samarth's life journeyప్రపంచకమే అండాకారంలో ఉన్నప్పుడు అండాకారంలో ఉండే కోడిగుడ్లు అమ్ముకు బతకడంలో తప్పేముందిరా అంది పేరు అదే అయినా, అర్థాంతరంగా కన్ను మూసిన మొగుడ్ని బతికించుకో లేకపోయిన సావిత్రమ్మ. తనెంతో తెలివైన వాడు, తనెంతో బలమైన వాడు, తనెంతో దమ్మున్నవాడు అయినా తండ్రి మూడు దశాబ్దాలుగా చేసిన పనే చేసి ఎదుగూబొదుగూ లేకుండా బతుకీడ్చి, వెనకా ముందూ ఏమీ మిగల్చకుండా బకెట్టు తన్నేసి పోవడంతో అలగ తిరుగుళ్ళు మానేసి ఆ పనే చేయక తప్పింది కాదు కావేటి రంగడికి.
కొంపకు యజమాని కొంపని కొల్లేరు చేసి పోవడం వల్ల తిప్పలు పడటం ఆరంభించేడు రంగడు. తండ్రిలా మూడు పదుల ఏళ్ళు అదే వ్యాపారం చేస్తూ కూచోడానికి నేనేం తెలివితక్కువవాణ్ణీ, బలం లేని వాణ్ణీ, దమ్ములేని వాణ్ణీ కాదు గదా. కాళ్ళు నేల మీద ఆనేదాకానే ‘కోడిగుడ్లోరు’ అని అరుస్తూ కాళ్ళరిగేట్టు తిరగడం అనుకుని ఆ ఇష్టంగానే ఆ పని మొదలేశాడు కారంగడు.
మూడు నాలుగు నెల్లకే మొఖం మొత్తింది. అరవలేనని గొంతుక, తిరుగలేనని కాళ్ళు మొండికేశేయి. అప్పుడు పెట్టాడు బుర్రకు పదును. గుడ్డు గొప్పా, కోడి గొప్పా అనాలోచించి, కోడే గొప్ప అని తేల్చేసుకున్నాడు. అంతే! గ్రుడ్లు అమ్మకం మానేసి కోళ్ళ అమ్మకం మొదలు పెట్టాడు. తెలివైన వాడు కదా ఓ బేరానికి కొని ఇంకో బేరానికి వాటిని అమ్మి లాభం లెక్క చూసుకోవటం అవసరమా అనుకున్నాడు. ఏదయినా అనుకున్నాడంటే అది చేసి తీరేవాడ్నే కదా రంగడు అంటరు. గొఱ్ఱెల పెంపకం మొదలుపెట్టాడు. లారీల్లో గొఱ్ఱెలు రవాణా అవుతుంటే, రింగు కుర్చీ మీద గిర్రున తిరుగుతూ చుట్ట పొగను వదిలాడు గాల్లోకి.
అదేంటో గాని రంగడికి ఎప్పటికీ గాల్లో తేలాలనే కోరికా, చేసే పనిలో మొఖం మొత్తడం మామూలైపోయేయి. అందుకే ఇంకా ఇంకా సంపాదించాలి అని బుర్ర లోపలికి తొంగి చూశేడు. ఈ సారి గొఱ్ఱె గొప్పదా బర్రె గొప్పద అని క్షణం ఆలోచించలేదు. డైరీ ఫాంను మించిన వ్యాపారం లేదు, గేదెల్నీ, పాల ఉత్పత్తుల్ని నమ్ముకున్న వాడికి ఢోకా లేనే లేదు అనుకున్నాడు. అలవాటుగా అనుకున్న పని అమలు చేశాడు. పాలు, వెన్న, జున్ను, ఐస్క్రీము అందరికీ రుచి చూపించి పెద్ద ఎత్తున డబ్బు పోగేశేడు. మెడ తిరగకుండా బంగారు గొలుసులు వేసుకున్నాడు. వేళ్ళు విరవడానికి వీలు పడకుండ ఉంగరాలు తొడిగేడు. కేజీ బంగారం, బోలెడు డబ్బూ, పెద్ద కొంపా పట్టుకొచ్చిన అమ్మాయిని వాటిని చూసి అందర కదుసుమా, పెళ్ళాడేడు. ఓ ఇంటి వాడయ్యేడు కొడుకని, సావిత్రమ్మ కళ్ళు ఒత్తుకుంది. పిల్లాపాపల్ని ఎత్తుకుంది.
మరో ఏడూ ఆపై ఏడూ ఇలాగ రెండు మూడేళ్ళు గడిచేప్పటికి రంగడికి ఐస్‌క్రీం అంటే వెగటొచ్చేసింది వంటికి షుగర్‌ వచ్చిందని కాదు గాని, చేసిన పనే చేయటం బొత్తిగా నచ్చదు కదా. కోడి గుడ్లను అమ్మేను, కోళ్ళని పెంచాను, గొఱ్ఱెల్ని సాకాను, బర్రెల్ని చిట్టూ, తవుడూ పెంచి పోషించి సంపాదించేను. ఇప్పుడు ఇంక ఏం చెయ్యాలా అని ఆలోచించడం మొదలేశేడు.
అప్పుడు రంగడికి వాడి చిన్ననాటి నేస్తం, ఇప్పటికీ కొనసాగుతున్న మిత్రుడు సలహా ఇచ్చేడు. ‘ఇప్పటిదాకా నీ బుర్ర బాగానే పనిచేసింది. కావల్సినంత మూట కట్టింది. ఇప్పుడు నా బుర్ర అరువిస్తా వాడుకో. కోళ్ళని పెంచావు, గొఱ్ఱెల్నీ, బర్రెల్నీ బతికించవు అదే అమ్మేదాకా, గొఱ్ఱెల్నీ, పాలిచ్చేదాకా బర్రెల్నీ. ఇప్పుడు నువ్వు పెంచుకోవలసింది మనుషుల్ని’ అన్నాడు. ఉలిక్కిపడ్డాడు రంగడు. ‘ఇదేం విచిత్రం, విడ్డూరంరా. కోళ్ళని, గొఱ్ఱెల్నీ, బర్రెల్నీ పెంచుకుంటారు కాని ఎవరైనా మనుషుల్ని పెంచుకుంటార్రా, అయిన పిల్లాపాపలున్న వాణ్ణేకదరా’ అన్నాడు అమాయకంగా కావేటి రంగడు.
‘ఓరి పిచ్చి రంగడూ ఈ కాలంలో మనుషుల్ని పెంచుకోవడమే అసలు సిసలైన లాభసాటి వ్యాపారం. బాగా కొవ్వు, కావాల్సినంత కండ పట్టి ఉన్న వాళ్ళు నీ పోషణలో ఉంటే నువ్వొక మహరాజువే, గ్యాంగు లీడర్‌వే, కాబోయే మంత్రిగారివే’ అన్నాడు రంగడి జిగ్రీ దోస్తు.
‘నాకు నమ్మకం లేదురా! చదువూ సంధ్యాలేని నిశానీ గాడ్ని. ఇంగ్లీషు ‘జడ్‌’ వరకే వచ్చి ఆపేసిన వాడ్ని. నేను రాజునవడమా! ఊరుకో ఊరికే మునగచెట్టు ఎక్కించకు కొమ్మ ఇరిగి కూలబడగల్ను’ అన్నాడు రంగడు. కానీ ఆ తర్వాత బాగా ఆలోచించి ఎప్పటిలాగే అడుగు ముందుకేశాడు. పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో కూచున్న కాళ్ళూపుకుంటూ, సిగారు నోట్లోనించి బైటికి తీస్తూ పెడుతూ, తు పోషించిన వాళ్ళు ఊళ్ళో షాపుల నుంచి వసూలు చేసుకొచ్చిన పైకం లెక్క కడుతుంటే, రియల్‌ దందాలో వచ్చిన నోట్లు కట్టలు కడుతుంటే ఉషారుగా ఈల వేయడం మొదలుపెట్టాడు. మహరాజు, గ్యాంగు లీడర్నీ అయ్యేను కదా ఇక మిగిలింది సాధించడానికి తను దాచి పెట్టిన కట్టల్లోంచి కొన్నింటిని ఓ పార్టీకి
ఫండుగా గిఫ్టుగా ప్రేమ కానుకగా అందించాడు.
అంగబలమూ, ఆర్థిక పుష్టీ అనగా జేజేలు కొట్టే కండలు పెంచిన పరివారము, నల్ల డబ్బు కావలసిందానికన్నా ఎక్కువ ఉన్నవాడిని కాక మరెవరిని ఎన్నుకుంటారు ప్రజలు. తాము కూటికి పేదలయి తమను ఏలుకునే వాడు ఓట్లు కొనేవాడయి ఉండాలే కోరికున్న ప్రజలు కోకొల్లలుగా ఉండడం వల్లే కదా ప్రజాస్వామ్యం ఛాతీ విరుచుకు నిలబడుతున్నది. కొనే వాడు లేకపోతే పాపం ఓటు ఎవరికి అమ్ముతారు ఓటర్లు. కొనడం బాగా తెల్సిన మొనగాడే కద సమర్థుడు.
ప్రజాసేవ వాడి రక్తంలోనే ఉందని, ఓ పార్టీ రంగడికి ‘భీఫామ్‌’ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది. రంగడి దాతృత్వానికి ప్రజలు జేజేలు కొట్టారు. కావేటి రంగడు రంగారవయ్యేడు. కావేటి రంగారావు అనే నేను… అంటూ మంత్రిగా ప్రమాణం చేసేడు. ఇటువంటి ‘సమర్థత’ ఉన్నవారికే కదా జీవితం ఒడ్డించిన విస్తరి అయ్యేది.
చింతపట్ల సుదర్శన్‌
9299809212