నవతెలంగాణ – రాయపోల్
సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం హేతుబద్ధమైన సత్యాన్ని ప్రబోధించే విలువలు గల సమసమాజం నిర్మాణం కోసం గౌతమ బుద్ధుడు మార్గదర్శకాలను సూచించడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన్ ఉమర్ అన్నారు. గురువారం వైశాఖ పూర్ణిమ 2568 వ బుద్ధ జయంతి సందర్భంగా గౌతమ బుద్ధుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం అనేది శాస్త్రానికి మార్పుకు అనుగుణంగా ఉండాలి.నీతిని ప్రభోదించేదిగా ఉండాలి. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మానవీయ విలువలు కలిగినదిగా ఉండాలన్నారు.హేతువుకు బద్ధమై ఉండాలి. సమత,కరుణ, ప్రజ్ఞను ప్రబోధించిన మార్గదర్శకుడు బుద్ధుడు అన్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుని మార్గంలో నడిచాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మతాలు క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం. మిగత మతాలు మోక్షదాతలు ఉన్నారని ప్రబోధించాయి. బుద్ధుడు మార్గదర్శకాలు మాత్రం మార్గదాతనే కానీ మోక్షదాతను కాదని ప్రబోధించాడు. తాను ప్రబోధించింది గుడ్డిగా నమ్మకుండా పరీక్షించుకొని ఆచరించాలని ప్రబోధించారు. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోమన్నారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒక నైతిక భావనగా బుద్ధుని బోధనలు సూచించాయి. గౌతమ బుద్ధుని మార్గంలో నేటి సమాజం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.