అన్ని ప్రసారాల సేవలకూ ఒకే చట్టం

Same law for all broadcasting services– బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్‌ బిల్లును తీసుకువచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : ఓటీటీ కంటెంట్‌, డిజిటల్‌ న్యూస్‌తో సహా బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులను క్రమబద్దీకరించేందుకు సమగ్ర చట్రపరిధిని అందించే బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్‌(నియంత్రణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (క్రమబద్దీకరణ) చట్టం, 1995, అలాగే దేశంలో ప్రస్తుతం బ్రాడ్‌కాస్టింగ్‌ రంగాన్ని శాసిస్తున్న ఇతర విధానపరమైన మార్గదర్శకాల స్థానే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
డొమైన్‌ నిపుణులు, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్లు, సాధారణ ప్రజానీకం సహా సంబంధిత అన్ని వర్గాలు, పక్షాలు రాబోయే 30 రోజుల్లో ఈ బిల్లుపై స్పందించి తమ ప్రతిస్పందనలను, వ్యాఖ్యలను పంపాలంటూ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.
ఓటీటీ కంటెంట్‌, డిజిటల్‌ న్యూస్‌ను కూడా కలుపుకుంటూ తన పరిధిని విస్తరించేందుకు, రెగ్యులేటరీ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, సమకాలీన నిర్వచనాలు, కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల నిబంధనలను ప్రవేశపెట్టేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది. వచ్చిన కంటెంట్‌ను సమీక్షించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా బిల్లు కోరుతోంది. అలాగే స్వీయ నియంత్రణకు బ్రాడ్‌కాస్ట్‌ సలహా మండలిని ఏర్పాటు చేయాలని కోరుతోంది. వివిధ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లుకు వివిధ ప్రోగ్రామ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ కోడ్‌లు ఇవ్వాలని బిల్లు కోరుతోంది. అలాగే వైకల్యాలతో బాధపడే వారికి మీడియాలో అవకాశం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, చట్టబద్ధమైన జరిమానాలు వుండాలని కోరుతోంది.
ఒకే చట్టం కిందకు వివిధ బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలను తీసుకురావడానికి రెగ్యులేటరీ నిబంధనలను సంఘటితపరిచి, ఆధునీకరించాల్సిన అవసరాన్ని బిల్లు పరిష్కరిస్తుందని కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న సేవలు, సాంకేతికతకలకు అనుగుణంగా సమకాలీన ప్రసార నిబంధనలకు నిర్వచనాలను బిల్లు తీసుకువచ్చింది. కంటెంట్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీలను ప్రవేశపెట్టడం ద్వారా స్వీయ నియంత్రణను పెంచుతోంది. ప్రస్తుతమున్న వివిధ విభాగాల ప్రతినిధులతో వేసే కమిటీని మరింత విస్తరించి, ప్రాతినిధ్యం పెంచి ‘బ్రాడ్‌కాస్ట్‌ సలహా మండలి’గా రూపొందించనుంది.
ఆపరేటర్లకు, బ్రాడ్‌కాస్టర్లకు సలహాలు, సూచనలు, హెచ్చరికలు, అభిశంసనలు లేదా జరిమానాలు వంటి చట్టబద్ధమైన శిక్షలను కూడా ప్రవేశపెట్టింది. జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించే నిబంధన వుంది. అయితే చాలా తీవ్రమైన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.