– ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ నేటినుంచే..
– ఉదయం 9.30గం||ల నుంచి
ధర్మశాల: ఇంగ్లండ్‌తో ఆఖరి, ఐదో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమైంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియాకు ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా.. ఇందులోనూ విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకోవాలంటే ప్రతి మ్యాచ్ భారత్‌కు కీలకమే. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ బుమ్రా.. ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా మూడు టెస్టుల్లో 17 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా రాకతో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లో ఒకరిపై వేటు పడే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్‌లో అదరగొడుతున్న జైస్వాల్-రోహిత్ ఓపెనింగ్ చేయనున్నారు. నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తుది జట్టులో ఉండటం ఖాయమే. గాయపడ్డ కేఎల్ రాహుల్, ఫామ్ లేమితో బాధపడుతున్న రజత్ పటీదార్‌లకు చోటు దక్కడం కష్టమే. మూడోటెస్ట్‌లో రాణించి సర్ఫరాజ్ ఖాన్‌తోపాటు దేవదత్ పడిక్కల్ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాగే కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో ఉంటాడు. అతడితో కలిసి ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్పిన్నర్ వైపు మొగ్గు చూపితే కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు ఖాయం.
చల్లటి వాతావరణంలో…
నాల్గోటెస్ట్ జరిగే హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ చల్లటి వాతావరణంతో కూడి ఉంటుంది. ధర్మశాల పిచ్ తొలుత సీమర్లకు అనుకూలంగా, ఆ తర్వాత స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. ఈ వేదికపై 2017లో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ పిచ్ వన్ సైడెడ్‌గా ఉండదని.. రెండు జట్లకు అనుకూలిస్తుందని ఇంగ్లండ్ బ్యాటర్, వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్‌స్టో తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా తొలి స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం టీమిండియా 64.58 విజయాల శాతంతో అగ్రస్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
జట్లు(అంచనా)..
ఇండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), జైస్వాల్, శుభ్‌మన్, పడిక్కల్/పటీదార్, సర్ఫరాజ్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రాలే, డకెట్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్(వికెట్ కీపర్), హార్ట్ లీ, మార్క్ వుడ్, బషీర్, ఆండర్సన్, రాబిన్సన్.
అశ్విన్ ఏ 100వ టెస్ట్
ధర్మశాల టెస్టు మ్యాచ్ ఆడటంతో రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ టీమిండియా ప్లేయర్‌గా ఘనత సాధించనున్నాడు. అంతర్జాతీయంగా టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 79మంది క్రికెటర్లు 100 టెస్టులు ఆడారు. అలాగే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ ఆడటంతో అశ్విన్ టెస్టు క్రికెట్‌లో భారత జాతీయ జట్టు తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన 14వ ప్లేయర్, ఐదో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. అంతకుముందు, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లను ఆడారు. అలాగే మూడో స్పిన్నర్‌గా అశ్విన్ నిలుస్తాడు. దీంతో పాటు దిగ్గజ బౌలర్ల రికార్డులను కూడా అశ్విన్ బ్రేక్ చేయనున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అశ్విన్ చరిత్ర సష్టించాడు. టెస్టుల్లో కుంబ్లే భారత్ తరఫున అత్యధిక వికెట్లు (619 వికెట్లు) తీసిన బౌలర్ కాగా, అశ్విన్ కేవలం 98 మ్యాచ్‌ల్లోనే 500 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో క్రికెటర్‌గా రికార్డు..
99 టెస్టులు ఆడి 584 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ తర్వాత 100వ టెస్టు ఆడే ముందు 500 వికెట్లు తీసిన తర్వాత ఈ మైలురాయిని పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా అశ్విన్ చరిత్రలో నిలిచాడు. 100 టెస్టు మ్యాచ్‌లకు ముందు 500 వికెట్లు తీసిన ఇద్దరిలో అశ్విన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ భారత్ తరఫున తన అరంగేట్రం చేసాడు. అప్పటి నుంచి టీమిండియా టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
99టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
మురళీధరన్(శ్రీలంక) : 584
అశ్విన్(ఇండియా) : 507
అనిల్ కుంబ్లే(ఇండియా) : 478
మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా) : 446
షేన్ వార్న్(ఆస్ట్రేలియా) : 436