పరుగుల వేటలో అదే వ్యథ

Sports– భారత బ్యాటర్లు విఫలం
– రాణించిన జైస్వాల్‌
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 164/5
– ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 474/10
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో వేదిక మారినా.. భారత బ్యాటర్ల వ్యథ మారటం లేదు. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌ బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట.. టీమ్‌ ఇండియా స్టార్స్‌ చేతులెత్తేశారు. ఆసీస్‌ స్కోరులో సగమైనా చేయకముందే.. బ్యాటింగ్‌ లైనప్‌లో సగం మంది పెవిలియన్‌కు చేరారు. యశస్వి జైస్వాల్‌ (82) అర్థ సెంచరీతో కదం తొక్కినా.. భారత్‌ ఇంకా ఫాలోఆన్‌ ప్రమాదంలోనే కొనసాగుతుంది. నేడు మూడో రోజు ఆటలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బాక్సింగ్‌ డే గతిని నిర్దేశించనున్నారు!.
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
బాక్సింగ్‌ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. అటు బ్యాట్‌తో, అటు బంతితో టీమ్‌ ఇండియాను కంగారూలు కంగారు పెట్టారు. పేసర్లు పాట్‌ కమిన్స్‌ (2/57), స్కాట్‌ బొలాండ్‌ (2/24) నిప్పులు చెరగటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కష్టాల్లో కూరుకుంది. 46 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (82, 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్‌ కోహ్లి (36, 86 బంతుల్లో 4 ఫోర్లు), కెఎల్‌ రాహుల్‌ (24, 42 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (3), ఆకాశ్‌ దీప్‌ (0) విఫలం అయ్యారు. అంతకుముందు, స్టీవ్‌ స్మిత్‌ (140, 197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (49, 63 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోరు సాధించింది. జశ్‌ప్రీత్‌ బుమ్రా (4/99) నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా (3/78), ఆకాశ్‌ దీప్‌ (2/94) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మరో 310 పరుగుల వెనుకంజలో నిలిచింది.
జైస్వాల్‌ జోరు :
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు సత్ఫలితం ఇవ్వలేదు. రాహుల్‌ను మూడో స్థానానికి నెట్టిన రోహిత్‌ శర్మ.. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ పాట్‌ కమిన్స్‌ ఓవర్లో ఫుల్‌ షాట్‌ను సాఫ్ట్‌గా ఆడిన హిట్‌మ్యాన్‌.. బొలాండ్‌కు సులువైన క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆసీస్‌ కొండంత తొలి ఇన్నింగ్స్‌ను సమం చేసే దారిలో ఇన్నింగ్స్‌ 12వ బంతికే తొలి వికెట్‌ పడింది. కెఎల్‌ రాహుల్‌ (24), యశస్వి జైస్వాల్‌ రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యం అందించారు. 13 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడీ ఆశలు రేపింది. కానీ పాట్‌ కమిన్స్‌ సూపర్‌ బంతితో రాహుల్‌ వికెట్‌ను గాల్లోకి లేపాడు. 51 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఈ సమయంలో యశస్వితో జత కట్టిన విరాట్‌ కోహ్లి (36) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. జైస్వాల్‌ కాస్త దూకుడుగా పరుగులు రాబట్టగా.. విరాట్‌ కోహ్లి ఆచితూచి ఆడాడు. ఆఫ్‌ స్టంప్‌కు ఆవలగా వెళ్లిన బంతులను సహనంతో వదిలేసిన విరాట్‌ కోహ్లి.. క్రీజులో ఎక్కువ సేపు నిలవాలనే తపనతో కనిపించాడు. ఏడు ఫోర్లతో 81 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌ మరో భారీ ఇన్నింగ్స్‌ బాదేలా కదం తొక్కాడు. కోహ్లి, యశస్వి జోడీ మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించింది. మరికొద్దిసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా భారత ఇన్నింగ్స్‌కు భారీ కుదుపు. యశస్వి జైస్వాల్‌ సింగిల్‌కు ప్రయత్నించగా.. కోహ్లి స్పందించలేదు. దీంతో జైస్వాల్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 41 ఓవర్లలో 153 పరుగులు. ఓ దశలో 152/2తో మెరుగ్గా సాగుతున్న భారత్‌.. 13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి రనౌట్‌ కాగా.. కోహ్లి బలహీనతను బొలాండ్‌ సొమ్ము చేసుకున్నాడు. నైట్‌వాచ్‌మన్‌ ఆకాశ్‌ దీప్‌ (0) 13 బంతుల్లోనే పెవిలియన్‌కు చేరాడు. దీంతో 164/5తో భారత్‌ ఇన్నింగ్స్‌ కుదేలైంది. రిషబ్‌ పంత్‌ (6 నాటౌట్‌), రవీంద్ర జడేజా (4 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచారు.
స్మిత్‌ శతకం :
స్టీవ్‌ స్మిత్‌ (140), పాట్‌ కమిన్స్‌ (49) ఆసీస్‌కు భారీ స్కోరు అందించారు. బ్రిస్బేన్‌లో ఫామ్‌లోకి వచ్చిన స్మిత్‌.. మెల్‌బోర్న్‌లో శతకంతో మెరిశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న స్మిత్‌ 167 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరుపు సెంచరీ బాదాడు. పాట్‌ కమిన్స్‌ సైతం ధాటిగా ఆడటంతో ఈ జోడీ ఏడో వికెట్‌కు 112 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. కమిన్స్‌ అవుటైనా.. స్టార్క్‌ (15)తో కలిసి స్మిత్‌ జోరు కొనసాగించాడు. టెయిలెండర్లు సైతం రాణించటంతో ఆస్ట్రేలియా 122.4 ఓవర్లలో 10 వికెట్లకు 474 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా (3/78), ఆకాశ్‌ దీప్‌ (2/94) రాణించారు. మహ్మద్‌ సిరాజ్‌ (0/122) 23 ఓవర్లలో 5.30 ఎకానమీతో పరుగులు ఇచ్చి బ్యాటర్లపై బుమ్రా, ఆకాశ్‌ పెంచిన ఒత్తిడిని వృథా చేశాడు!.
ఫాలో ఆన్‌ గండం? :
మెల్‌బోర్న్‌లో టీమ్‌ ఇండియా ఫాలో ఆన్‌ ప్రమాదంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన ఆసీస్‌.. మరోసారి బ్యాట్‌ పట్టాలనే ఆలోచనలో లేరు!. ప్రస్తుతం భారత్‌ స్కోరు 164 పరుగులు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు 310 పరుగుల వెనుకంజలో నిలిచారు. ఫాలో ఆన్‌ మార్క్‌ దాటేందుకు కనీసం 275 పరుగులు చేయాలి. ఆ మార్క్‌కు భారత్‌ మరో 111 పరుగుల దూరంలో కొనసాగుతోంది. పంత్‌, జడేజాలకు తోడు ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ నలుగురు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అంచనాల మేరకు ఆడితే భారత్‌ మంచి స్కోరు చేయగలదు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : కాన్‌స్టాస్‌ (ఎల్బీ) జడేజా 60, ఖవాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 57, లబుషేన్‌ (సి) కోహ్లి (బి) సుందర్‌ 72, స్మిత్‌ (బి) ఆకాశ్‌ 140, హెడ్‌ (బి) బుమ్రా 0, మార్ష్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 4, అలెక్స్‌ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ 31, కమిన్స్‌ (సి) నితీశ్‌ (బి) జడేజా 49, లయాన్‌ (ఎల్బీ) బుమ్రా 13, బొలాండ్‌ నాటౌట్‌ 6, ఎక్స్‌ట్రాలు : 27, మొత్తం : (122.4 ఓవర్లలో ఆలౌట్‌) 474.
వికెట్ల పతనం : 1-89, 2-154, 3-237, 4-240, 5-246, 6-299, 7-411, 8-455, 9-455, 10-474.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 28.4-9-99-4, మహ్మద్‌ సిరాజ్‌ 23-3-122-0, ఆకాశ్‌ దీప్‌ 26-8-94-2, రవీంద్ర జడేజా 23-4-78-3, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 7-0-21-0, వాషింగ్టన్‌ సుందర్‌ 15-2-49-1.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (రనౌట్‌) 82, రోహిత్‌ శర్మ (సి) బొలాండ్‌ (బి) కమిన్స్‌ 3, రాహుల్‌ (బి) కమిన్స్‌ 24, విరాట్‌ కోహ్లి (సి) అలెక్స్‌ (బి) బొలాండ్‌ 36, ఆకాశ్‌ దీప్‌ (సి) లయాన్‌ (బి) బొలాండ్‌ 0, రిషబ్‌ పంత్‌ నాటౌట్‌ 6, రవీంద్ర జడేజా నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (46 ఓవర్లలో 5 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-8, 2-51, 3-153, 4-154, 5-159.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 13-0-48-0, పాట్‌ కమిన్స్‌ 13-2-57-2, స్కాట్‌ బొలాండ్‌ 12-3-24-2, నాథన్‌ లయాన్‌ 5-1-18-0, మిచెల్‌ మార్ష్‌ 3-0-15-0.