అవే వ్యూహాలు…

Same strategies...”ఎక్కడ ఎన్నికలు మొదలవుతాయో! ఎక్కడ అధికారం కోసం తమ పార్టీ బాహువులను చాస్తుందో! ఎక్కడ తమ పాలనకు వ్యతిరేకత వెల్లువెత్తుతుందో! అక్కడ కచ్చితంగా మత విద్వేషం రగుల్కుంటుంది. ఉన్మాదం తలలెత్తుతుంది.” ఇది అక్షరాలా ఆచరిస్తూ ఉన్నది కాషాయ పరివారం. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కొన్ని దశాబ్దాలపాటు రాజకీయంగా వాడుకున్న ఆర్టికల్‌ 370ని తాజా మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలలోనూ వాడుకొని లాభపడాలని భావిస్తున్నట్టు ఉంది. కాలికి బలపం కట్టుకొని మరీ మహారాష్ట్రాలో తిరుగుతున్న ప్రధాని, తాను పాల్గొన్న ప్రతి సభలోనూ ఆర్టికల్‌ 370 గురించే ఎక్కువగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ పార్టీ మరో కీలకనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దీనినే ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. తాజాగా జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో సాక్ష్యాత్తు ప్రధానమంత్రే ”ఆర్టికల్‌ 370 పునరుద్దరణ తన ప్రాణం ఉన్నంతవరకు జరగదు” అంటూ వ్యాఖ్యానిం చడం ఎంత వరకు సరైంది?
ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలంటూ జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో ప్లకార్డు ప్రదర్శన బీజేపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పించింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై యావత్‌ దేశం ముక్కుమీద వేలు వేసుకుంది. ‘మీరు లాక్కున్న హక్కులనూ అధికారాలను తిరిగి ఇవ్వండి’ అని కనీసం ప్లకార్డు ప్రదర్శిస్తే తప్పు ఏంటి? ఆ హక్కు కూడా సభలోని సభ్యుడికి ఉండదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రే కాంగ్రెస్‌ రాజ్యాంగ విలువలను కాలరాస్తుందంటూ విమర్శలు ఎక్కు పెడుతూ.. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అసలు తీర్మానం పెట్టడానికే కుదరదని, సభనే అడ్డుకోవడం చట్ట సభలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?
జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ పొందుపర్చబడింది. భారత యూనియన్‌లో కాశ్మీర్‌ రాజ్యం విలీనానికి సంబంధించిన ఒకానొక చారిత్రక సందర్భంలో ఇది జరిగింది. పరస్పర అంగీకారంతో అక్కడి ప్రజలకు రాజ్యాంగబద్ధ గ్యారంటీ ఇవ్వబడింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి రాగానే ఏకపక్షంగా 370 ఆర్టికల్‌ను, అందుకనుగుణమైన 35(ఎ)ను తొలగించింది. ఒక రాష్ట్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 370 ఆర్టికల్‌ ద్వారా జమ్ము కాశ్మీర్‌కు లభించిన ప్రత్యేక హోదాను పునరుద్ధరిం చాలని, దానిపై రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరితో సంప్రదించాలని కేంద్రాన్ని అసెంబ్లీ ద్వారా కోరడం బీజేపీకి నేరంగా కనిపించింది. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ, ఆ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కాలనుకుంటున్న కాషాయి పార్టీ ఆ విలువలను గౌరవిస్తుందనుకోవడం అవివేకమే అవుతుంది. బహుశా ఆర్టికల్‌ 370 ముగిసిన చరిత్ర అని మోడీ-షాలు ప్రకటించినందువల్ల కాబోలు, దాని ఊసెత్తడమే దేశద్రోహమన్న స్థాయిలో బీజేపీ దాడులకు తెగబడుతుంది.
370 ఆర్టికల్‌ రద్దు చేశాక నెలల పర్యంతం భద్రతా బలగాల పహారాలో విపక్ష నేతల అక్రమ నిర్బంధాలతో, పౌర హక్కుల హననం సాగింది. పత్రికా స్వేచ్ఛ మృగ్యమైంది. ఇంటర్నెట్‌ బంద్‌ అయింది. ఈ కాలంలో బీజేపీ రాజేసిన మత విద్వేషాలు, ఉద్రిక్తతలకు అంతే లేదు. అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను ఓటుతో తెలియజెప్పారు. అయినా బుద్ధి తెచ్చుకోని బీజేపీ తన విద్వేష రాజకీయాలను కొనసాగిస్తోంది. జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీ సభ్యుల జుగుప్సాకర ప్రవర్తన ప్రధాని మోడీ, అమిత్‌షా, బీజేపీ కేంద్ర నాయకత్వం డైరెక్షన్‌లోనే జరిగిందన్నది వాస్తవం. సున్నితమైన జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణే అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. రాజ్యాంగంపై వారికి నమ్మకం కలిగిస్తుంది. ఈ దేశ పౌరులమన్న విశ్వాసం పెంపొందిస్తుంది. రాజకీయ పార్టీలు, అందరితో విస్తత సంప్రదింపులతోనే జమ్ము కాశ్మీర్‌లో శాంతి సామరస్యాలు నెలకొల్పబడతాయి.
ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా అవే విద్వేషాలను రెచ్చగొడుతూ, మరల ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ ఆచరణను ప్రజలు అప్రమత్తతతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశంలో విస్తరిస్తున్న వారి వ్యూహాలు, విద్వేష జ్వాలలతో జాతి సమైక్యతకు ప్రమాదం పొంచి ఉంది.