ఆమ్లాతో అద‌ర‌హో

రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని ఆహారాలను తినాలి. అలాంటి వాటిలో ఉసిరికాయది మొదటి స్థానమనే చెప్పాలి. చాలా మంది ఉసిరిని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు. ఉసిరి జ్యూస్‌ తాగినా, ఎండబెట్టి వరుగులు చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయ చేసినా దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. ఉసిరిని సింపుల్‌గా సూపర్‌ ఫుడ్‌ అని పిలవచ్చు. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో విటమిన్‌ సీ, డీ, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కెరోటిన్‌, బీ-కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరితో చేసుకునే వంటలు నేటి మానవిలో…
ఉసిరికాయ రైస్‌
కావలసిన పదార్థాలు : బియ్యం – ఒక కప్పు, ఉసిరికాయలు – ఎనిమిది(మీడియం సైజువి), నువ్వులు – రెండు స్పూన్లు, మిరియాలు – అర స్పూను, పసుపు – అర స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, అల్లం తురుము – అర స్పూను, కరివేపాకు – గుప్పెడు, ఇంగువ – చిటికెడు, జీలకర్ర – ఒక స్పూను, మినపప్పు – ఒక స్పూను, శనగపప్పు – ఒక స్పూన్‌, ఆవాలు – ఒక స్పూన్‌, నూనె – సరిపడినంత, పల్లీలు – గుప్పెడు, పచ్చిమిర్చి – నాలుగు, ఎండుమిర్చి – నాలుగు.
తయారీ విధానం : ఉసిరికాయ రైస్‌ వండడానికి ముందుగా అన్నాన్ని వండి పెట్టుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం పొడిపొడిగా వుండేలా వండుకోవాలి. అన్నం ఉడికాక ఒక బేసిన్‌లో ఆరబెట్టి పసుపు, ఉప్పు కలపాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నువ్వులు, మిరియాలు వేసి వేయించుకోవాలి. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉసిరికాయలను సన్నగా తురిమి పక్కన ఉంచుకోవాలి. స్టవ్‌ మీద ఉన్న కళాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకులు వేయాలి. అందులోనే కొద్దిగా అల్లం తురుము, ఉసిరికాయ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని చిన్నమంట మీద ఫ్రై చేయాలి. ఆల్రెడీ అన్నంలో ఉప్పు కలిపాం కాబట్టి… ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. వేయించుకున్న ఈ ఉసిరి తాలింపు మిశ్రమాన్ని పసుపు, ఉప్పు కలిపిన అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీగా నోరూరించే ఉసిరికాయ రైస్‌ రెడీ అయిపోయింది.
పప్పు
కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు-ఆరు, కందిపప్పు- ఒక కప్పు, పచ్చిమిర్చి-ఆరు, టమాటాలు- రెండు, నూనె-మూడు టేబుల్‌ స్పూన్లు, మెంతులు- అరటీస్పూను, ఆవాలు- ఒక స్పూను, పచ్చిశెనగపప్పు- ఒక స్పూను, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు – కొద్దిగా, వెల్లుల్లి- ఎనిమిది రెబ్బలు, చిటికెడు ఇంగువ.
తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు అరగంట నానబెట్టి, టమాటా ముక్కలు, పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించాక ఉప్పువేసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్‌ పోసి మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన ఉసిరికాయలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని గింజలను తీసేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని పచ్చిమిర్చి, ఉడికించిన ఉసిరికాయ ముక్కలు వేసి కాస్త బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. తాలింపుకి బాండీలో కొద్దిగా నూనె వేడిచేసి మెంతులను కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశెనగపప్పు, కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి వేయించాలి. అందులోనే చిటికెడు ఇంగువ వేస్తే కమ్మటి వాసన వస్తుంది. అందులోనే ఉసిరి, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి కొద్దిగా వుడికించాలి. ఇప్పుడు ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో కలిపి ఓ రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే ఉసిరికాయ పప్పు రెడీ. అన్నం, రోటీల్లోకి ఈ పప్పు చాలా రుచిగా వుంటుంది.
మురబ్బా
కావాల్సిన పదార్థాలు : ఉసిరి కాయలు – అర కిలో, చక్కెర – అర కిలో, ఉప్పు – పావు స్పూను, నిమ్మ రసం – ఒక స్పూను, యాలకులు- నాలుగు.
తయారీ విధానం : ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడుచుకోవాలి. తర్వాత స్టౌ ఆన్‌ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు దానిపైన జాలి గిన్నెను పెట్టుకుని వాటిలో ఉసిరికాయలు వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. (ఇలా స్టీమ్‌ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలను కూడా వాడుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా చేస్తే మురబ్బా చెడిపోయే అవకాశం ఉంటుంది) ఉసిరికాయలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరి కాయలకు ఫోర్క్‌ స్పూన్‌తో చిల్లులు పెట్టుకుని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఓ గిన్నెలో చక్కెర, 3 టేబుల్‌ స్పూన్ల నీళ్లు, ఆవిరిలో ఉడికించిన ఉసిరికాయలను వేసి సన్నమంటమీద ఉడికించాలి. (చక్కెర వద్దనుకునేవారు బెల్లం, లేదా సగం చక్కెర, సగం బెల్లం వాడుకోవచ్చు) పంచదార/ బెల్లం కరుగుతున్న సమయంలోనే ఉప్పు, నిమ్మ రసం, యాలకులు వేసి కలపాలి. నిమ్మ రసం వేయడం వల్ల ఇందులో ఉండే వగరు పోతుంది. యాలకుల వల్ల స్వీట్‌కు మంచి ఫ్లేవర్‌ వస్తుంది. పంచదార కరిగి పాకం బంగారు రంగులోకి వచ్చేవరకు ఈ మధ్యమధ్యలో మిశ్రమాన్ని కలుపుతూ వుండాలి. తీగ పాకం వచ్చాక స్టౌ ఆఫ్‌ చేస్తే చాలు… ఆమ్లా మురబ్బా రెడీ. ఇవి ఒక రోజు తర్వాత తింటే ఉసిరికాయలకు పాకం పట్టి చాలా టేస్టీగా వుంటాయి.
ఆమ్లా బర్ఫీ
కావాలపిన పదార్థాలు: ఉసిరికాయ పేస్ట్‌ – ఒక కప్పు, బెల్లం తురుము – కప్పు, అల్లం – చిన్నముక్క, యాలుకల పొడి – అర స్పూను, నల్ల ఉప్పు – అర స్పూను, మొక్కజొన్న పిండి- రెండు స్పూన్లు, నెయ్యి – ఒక స్పూను. పంచదార పొడి – తగినంత
తయారీ విధానం: 300 గ్రాముల ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసి పాన్‌ పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ల గిన్నెపై చిల్లుల గిన్నె పెట్టుకుని అందులో ఉసిరికాయలు పెట్టి మూత పెట్టి ఓ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో వాటిని రెండు వైపులా తిప్పుకోవాలి.
మెత్తగా ఉడికించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీజార్‌లోకి తీసుకుని అల్లం వేసి నీరు పోయకుండా మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసి పాన్‌ పెట్టి ఈ పేస్ట్‌ను, అంతే పరిమాణంలో బెల్లం వేసుకుని, ఈ రెండింటి మిశ్రమాన్ని కలుపుతూ బెల్లం కరిగేంతవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత యాలుకలు పొడి, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులోనే మొక్కజొన్న పిండిలో రెండు చెంచాల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి.. ఉసిరి మిశ్రమంలో పోసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి బాగా దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బటర్‌ పేపర్‌ మీద పరుచుకుని, దానిపైన మరో బటర్‌ పేపర్‌ పెట్టి చపాతీ కర్రతో సమానంగా రోల్‌ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకోవాలి.
చట్నీ
కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు-250 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు-టీస్పూన్‌, ఎండుమిర్చి-12, కరివేపాకు – 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది, మెంతులు- అరటీస్పూన్‌, మినప్పప్పు – రెండు స్పూన్లు, నూనె – తాలింపుకు సరిపడా, నిమ్మరసం – కొద్దిగా, ఆవాలు – ఒక స్పూను, జీలకర్ర- అర స్పూను, ఎండుమిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, చిటికెడు ఇంగువ.
తయారీ విధానం : ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని రెండు స్పూన్ల నూనెలో మగ్గించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని, అదే పాన్‌లో మరి కొంచెం ఆయిల్‌ వేసి, వేడయ్యాక మెంతులు, మినపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని, ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మగ్గబెట్టుకున్న ఉసిరి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం పిండి తాలింపు వేసుకుంటే చాలు…