టీనేజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో అమ్మాయిల్లో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. వారికే కాదు వారి తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన ప్రారంభమవుతుంది. పిల్లలకు ఏది ఎంతవరకు చెప్పాలి? ఏది చెప్పకూడదు? ఇలా ఎన్నో సందేహాలు, అపోహలు మదిలో ఉంటాయి. ఎందుకంటే బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న ఈ దశ ఎంతో కీలకం. ఇప్పుడు ఏర్పరచుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. కనుక ఈ సమయంలో పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
పిల్లలు ప్రతి విషయాన్ని నేర్చుకునేదీ ఈ సమయంలోనే. అంతేకాదు భావోద్వేగాల పరిణతి కూడా ఇప్పుడే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వారిని విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనే కాకుండా, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్‌గా దూరమయ్యే అవకాశం వుంది. ఫలితంగా తమ సమస్యలను చెప్పడానికి ముందుకురాక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి, తప్పు సరిచేసేముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఈ సమయంలో కుటుంబం, టీచర్లు వాళ్లను మరింతగా అర్థంచేసుకోవాల్సి వుంటుంది.
శుభ్రతా ముఖ్యమే
పీరియడ్స్ ప్రారంభమయ్యాక పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రతి 4-6 గంటలకొకసారి ప్యాడ్ మార్చు కునేలా చూడాలి. మెన్‌స్ట్రువల్ కప్స్ వంటివి వాడుతుంటే వాటిని శుభ్రపరచడం, స్టెరిలైజ్ చేయడం వంటివి నేర్పించాలి. క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు వంటివి మార్చుకోవడం అలవాటు చేయాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉత్సాహంగా వుంటారు.
ఎదుగుదలకు తగినట్టు…
ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరి. ఎంత బిజీగా ఉన్నా సరే.. పిల్లలకు మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. అధిక ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీని గురించి ఒకరోజు ముందుగానే ప్రణాళిక వేసుకుంటే వాటి తయారీ సులభం అవుతుంది.
నీళ్లు తాగాలి…
ఆహారం ఒక్కటే కాకుండా.. సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది పిల్లలు చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. రోజుకి కనీసం 12గ్లాసుల నీళ్లు తాగేలా వారిని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే చక్కెరలేని పండ్లరసాలు తాగించాలి. కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్‌లు, కత్రిమ తీపి కలిగిన పానీయాలకు దూరంగా ఉంచాలి.
హార్మోనుల్లో మార్పులు
ముఖ్యంగా టీనేజ్ పిల్లలను ఇబ్బందిపెట్టే మరో సమస్య మొటిమలు. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ వివరించాలి. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకుండా చూసుకోవాలి. పీహెచ్ సమతుల్యత ఉన్న ఫేస్‌వాష్‌ను రోజుకి రెండుసార్లు వాడాలి.. ఆయిల్ ఫేస్‌క్రీములకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో అండర్ ఆర్మ్స్, ప్రైవేట్ భాగాల్లోని అవాంఛిత రోమాలు చెమట, ఇన్ఫెక్షన్లకూ దారితీయొచ్చని.. కాబట్టి, షేవింగ్, వ్యాక్సింగ్ వంటి పద్ధతులను పిల్లలకు వివరిం చాలి. ఇకపోతే బ్రెస్ట్ ఎదుగుదల, బ్రా వేసుకోవడం లాంటి విషయాలు వాళ్లకు పూర్తిగా కొత్తగా ఉంటుంది. అందుకే వాళ్లలో వచ్చే ఈ మార్పులన్నింటి గురించి సిగ్గుపడకుండా, సౌకర్యంగా మనతో మాట్లాడగలిగేలా ప్రోత్సహించాలి.
వ్యాయామంతో
సిగ్గు, బిడియం వల్ల టీనేజ్ పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, ఆ ఫీలింగ్స్‌ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అందుకోసమే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. ముఖ్యంగా వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ప్రశాంతంగా
శరీరంలో వచ్చే మార్పులు ఒకవైపు, చదువు మరోవైపు ఫలితంగా పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వాలి. ఇది వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్‌వర్క్ వంటివి చేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతారు.
గాఢ నిద్ర ఉంటే
రాత్రిపూట కనీసం 7గంటలపాటు గాఢనిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రించేటప్పుడు తాజా, పరిశుభ్రమైన దుస్తులు వేసుకునేలా చూడాలి. పడుకునే ముందు కాఫీ, టీలు వంటివి ఇవ్వకూడదు. ఇంకా పరీక్షల సమయంలో రాత్రంతా మేలుకుని చదవకుండా ముందు నుంచే సన్నద్ధమయ్యేలా చూడాలి. ఇవన్నీ నిద్ర నాణ్యతను పెంచేవని నిపుణులు వివరిస్తున్నారు.
అపోహలు తొలగిస్తేనే
ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే పీరియడ్స్.. శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులు సంభవిస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవ్వకముందే అర్థమయ్యేలా లాజికల్‌గా, మనసు నొప్పించకుండా వివరించాలి. అప్పుడే వారి మనసులో ఉన్న భయాలు, అపోహలూ తొలగిపోయి.. వస్తున్న మార్పులను అర్థం
చేసుకుంటారు.
అదీ చెప్పాలి
ఇవేకాకుండా.. టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ లాంటి వాటి గురించీ తెలియజేయాలని సూచిస్తున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని.. ఫలితంగా ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా మనతో మాట్లాడతారు.