– సమ్మక్క ఆలయం శుద్ధి
– ప్రత్యేక పూజలు నిర్వహించిన చందవంశీయ పూజారులు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవత అయిన సమ్మక్క పుట్టిన ఊరు బయ్యక్కపెట్ లో చందా వంశీయులైన (తలపతులు) సమ్మక్క పూజారులు బుధవారం ఘనంగా గుడి మెలిగే పండుగ నిర్వహించారు. పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందగోపాల్, సమ్మక్క ప్రధాన పూజారి చందా రఘుపతిరావు ఆధ్వర్యంలో చందా వంశీయులు ఉదయమే తలంటి స్థానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి అత్యంత నియమ నిష్ఠలతో వారి ఇండ్లను, గుడిని శుభ్రపరచారు. అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి గుడి పై కప్పారు. గుడికి ఉన్న పాత సామాగ్రిని తొలగించి నూతన కర్రలతో, ఎట్టిగడ్డి తో గుడిని కప్పి అలంకరించారు. ఆదివాసి సంప్రదాయాల్లో ప్రకారం సమ్మక్క గతంలో ఉన్న గుడిసె ను నూతన పరికరాలతో మళ్ళీ నిర్మించారు. దీంతో బయ్యక్కపెట్ లో కూడా మినీ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేడారం లో లాగానే వారం ముందు నుండే ఈ గుడి మెలిగే పండుగ ను చేస్తారు. ఫిబ్రవరి 12 నుండి 15 వరకు ఘనంగా సమ్మక్క పుట్టిన ఊరు అయిన బయ్యక్కపెట్ లో (మండే మెలిగే పండుగను) మినీ జాతరను నిర్వహించినట్లు చందవంశీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారులు తలపతులు చంద పరమయ్య, చంద్ర లక్ష్మణరావు, కృష్ణ మూర్తి, చంద కళ్యాణ్ కుమార్, చంద గణేష్, మల్లెల సోమేష్, కోరం పాపారావు, పాయం వెంకటేశ్వర్లు, నాగులమ్మ పూజారి చందర్ లక్ష్మణరావు తదితరులు చందవంశీలు తలపతులు పాల్గొన్నారు.