సమ్మక్క సారక్కలు దేవతలుకారు, గిరిజన వనితలు!

Sammakka Sarakkas are gods and tribal women!తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ జిల్లా తాడ్యాయి మండ లం మేడారం గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి స మ్మక్క సారక్కల జాతర జరుగుతుంది. దీనికి చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో జనం వస్తుంటారు. సమ్మక్క సారక్కలు గిరిజనులు కానట్టు ‘దేవతలు’- అని చెప్పడం ఒక మోసం! స మ్మక్క సారక్కలు, పగిడిద్దరాజు, జంపన్నలు ఆది వాసీ గిరిజనులు, వీరు తమ హక్కుల కోసం పోరా డుతూ అమరులైన వారు. కేవలం గిరిజన వీరులు మాత్రమే!
వీరి చారిత్రక నేపథ్యం ఇలా ఉంది. సాధారణ శకం 12వ శతాబ్దం ఓరుగల్లును కాకతీయులు ని రంకుశంగా పాలిస్తున్న రోజులు. ఇతర ప్రాంతాల పై ఆధిపత్యం కోసం తాపత్రయపడిన ప్రతాపరు ద్రుడు గిరిజనుల నాయకుడైన పగిడిద్ద రాజును ఆహ్వానించి, గిరిజనులతో తన పాలనలోకి రావాలని కోరాడు. అతను అందుకు సమ్మతించకపోవడంతో అనేక విధాలుగా ప్ర యత్నించాడు. ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో విపరీ తంగా ఒత్తిడి పెంచాడు. పగిడిద్దరాజు నాయకత్వంలో ఉన్న గిరిజనులెవరూ లెక్కచేయలేదు – అసహనంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు – ”తన ఆజ్ఞను అతిక్రమించిన వారికి మరణ దండన తప్పదని” బెదిరించాడు. భయభ్రాంతులకు గురిచే శాడు. స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసీ గిరిజనులు మరొకరి అదుపు ఆజ్ఞలతో ఉండడానికి ఇష్ట్ఠపడలేదు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని మాట తిరస్కరించారు.
ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించి, నానా బీభత్సం సృష్టించాడు. వారి జీవితాల్ని అతలాకుతలం చేశాడు. ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి – గిరిజనుల రాజైన మేడరాజు, పెంపుడు కూతురు సమ్మక్కను తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ము గ్గురు- సంతానం. మేడారం పాలకుడైన పగిడిద్దరాజు కాకతీ యులకు సామంతుడు. రాజ్యకాంక్షతో ప్రతాపరుద్రుడు, మేడ రాజు పాలించే పొలబాసపై దండెత్తుతాడు. ఆ దాడి తట్టుకో లేక మేడరాజు తన కూతురు దగ్గరికి మేడారం పారిపోయి అక్కడ ఆజ్ఞాతవాసం గడుపుతుంటాడు. ఆ సమయంలో వచ్చి న కరువు కాటకాల వల్ల పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోతాడు. కప్పం చెల్లించకపోవడం ఒక కారణ మైతే, తన మామగారైన మేడరాజుకు ఆశ్రయం కల్పించడం మరో కారణం. తనకు లొంగిపోనని చెప్పిన పగిడిద్దరాజును ఇక యుద్దంతోనే లొంగదీసుకోవాలనుకుని, తన మంత్రి యు గంధరుడితో కలిసి, ప్రతాపరుద్రుడు మాఘశుద్ద పౌర్ణమిరోజున పగిడిద్దరాజుపై యుద్ధం ప్రక టించాడు. పగిడిద్దరాజు తన కొడుకు జంపన్న ను తీసుకుని, బలగాలను సమాయత్తం చేసి, కాకతీయసైన్యాలను ఎదుర్కొంటాడు. వీరోచి తంగా పోరాడుతూ పగిడిద్దరాజు, గోవిందరా జులు ప్రాణాలు వదిలేస్తారు. దాంతో, సమస్య తీరిందని ప్రతాపరుద్రుడు సంబరపడ్డాడు. కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.
గిరిజన మహిళలు సంఘటితమై మళ్లీ విజ యదుందుభి మ్రోగించారు. ఈ సారి సమ్మక్క, తన కూతురు సారక్కతో కలిసి సారథ్యం వహిం చింది. అతి పెద్దదైన, సుశిక్షితులైన కాకతీయ సైనికులతో గిరిజన మహిళలు గెలవలేకపోయారు. సమ్మక్క, సారక్క, నాగ మ్మ- అనేకమంది గిరిజనులు వీరమరణం పొందారు. ఓట మిని భరించలేక జంపన్న దగ్గరగా ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆనాటి నుండి సంపెంగ వాగు జంపన్నవాగుగా పిలవబడుతోంది. కాకతీయుల దృష్టిలో ఇది ఒక సంఘటన మాత్రమే. గిరిజన ప్రాంతాలు స్వాధీనం చేసుకోగలిగినందుకు విజయోత్సవాలు జరుపుకు న్నారు. కానీ, గిరిజనుల దృష్టిలో ఇది ఒక మహోజ్వల చారిత్రక ఘట్టం! బలవంతుడైన కాకతీయ రాజును ఎదుర్కొని తమ గిరిజన అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి వీరోచితంగా పోరాడిన సాహసోపేతమైన ఘనకార్యం!! అసువులు బాసిన గిరిజన అమర వీరుల్ని స్మరించుకోవడానికి ఏర్పడ్డ గొప్పఅవకాశం. దాన్ని వారు శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. అదే కార్యక్రమంలో సమ్మక్క సారక్క జాతరగా స్థిరపడింది.
కాకతీయులతో పోరాడి వీరమరణం పొందిన పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, జంపన్నలను రెండేళ్లకు ఒకసారి గుర్తు చేసుకుంటారు. అదే మేడారంలో రెండేళ్ళకు ఒకసారి జరిగే జాతర.ఆ సందర్భానికి చుట్టు పక్కల ప్రాంతాల నుండి గిరి జనులు, ఆదివాసులు, కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరు కుంటారు. పల్లెల నుండి మాత్రమే కాకుండా, పట్టణాలు, నగ రాల నుండి కూడా జనం అధిక సంఖ్యలో అక్కడికి చేరుతుం డడంతో 1967లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ జాతర ను తన పరిధిలోకి తీసుకుంది. ప్రభుత్వ ఎండోమెంట్‌శాఖ, వచ్చిపోయే వారికి రవాణా సౌకర్యం కల్పించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, తరువాత జరుగుతూ వచ్చిన ప్రచారం మూడనమ్మకాల వ్యాప్తికి దారితీసింది. ఆ శతాబ్దంలో చైతన్య వంతులైన గిరిజన మహిళలు యుద్ధానికి దిగడం – చాలా గొప్ప విషయమే – కానీ ఆ మహిళలిద్దరూ దేవతలయినట్టూ, వారికి మహిమలున్నట్టు – వారికి మొక్కులు మొక్కితే తీరతా యన్నట్టూ ప్రచారం చేయడం-ఆ ప్రాంతాన్ని ఒక వ్యాపార కేంద్ర బిందువుగా మార్చి వైదిక మత ప్రభావంలోకి నెట్టే యడం తీవ్రంగా నిరసించదగింది. ఆదివాసీ, గిరిజన సంస్కృ తిని ధ్వంసం చేసినట్టే కదా?
ప్రభుత్వ జోక్యంతో స్థాయి పెంచుకున్న ఈ జాతర, ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాన్ని ఆకర్షిస్తోంది. వ్యాపారాలు వృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కానీ, వాస్తవంగా అనేక అకృత్యాలకు అది నిలయమవుతూ వచ్చింది. వాగులో ఆడా మగా కలిసి స్నానాలు చేయడంతో స్త్రీలపై అత్యాచా రాలు ఎక్కువయ్యాయి. పరిసర ప్రాంతాలన్నీ మలమూత్రా లతో కలుషితమయ్యాయి. అధిక సంఖ్యలో వచ్చిపోయే వాహ నాలతో అక్కడ కార్బన్‌ మొనాక్సైడ్‌ స్థాయి పెరిగి, శుభ్రమైన గాలి దొరక్కుండా పోయింది. గిరిజన సంస్కృతిని గిరిజన సం స్కృతిగా ఉండనీయక, నగరవాసులు దాన్నొక షాపింగ్‌ మాల్‌ లాగా మార్చారు. అంతకుముందు చుట్టుపక్కల ఉన్న గ్రామా లన్నీ తాగునీటి కొరకు జంపన్న వాగుపై ఆధారపడేవి. జాతర వల్ల వాగు నీరు మురికై పోవడం వల్ల, అనేక గ్రామాలు తాగు నీటికై ఇబ్బందిపడుతున్నాయి. కలరా, అతిసారా వంటి అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. తమ జీవనస్థితిగతుల గూర్చి ఆలో చించండని గిరిజనులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదికలిచ్చా రు. జన జీవితాన్ని అస్తవ్యస్తం చేసే జాతరలు అవసరమా? అంటే, ప్రభుత్వానికి వాటివల్ల వచ్చే ఆదాయం అవసరం! రెం డెళ్ళకోసారి వారం పదిరోజులు జరిగే సమ్మక్క సారక్క జాతర అక్కడి ప్రజాజీవితాన్ని నాశనం చేస్తోంది. ఆది వాసీలను, వారి విశ్వాసాల్ని ప్రభుత్వ ఎండోమెంట్‌ శాఖ, చాకచాక్యంగా దోపిడీ చేస్తున్నట్టుగా ఉంది. మరీ ముఖ్యంగా వీరనారీమణుల్ని ”దేవ తలుగా” ప్రచారం చేయడంతో ప్రజల్ని అంధవిశ్వాసాల్లో ముం చి ఎదగకుండా చేస్తోంది. అది చాలా ప్రమాదం! దేశ వ్యాప్తం గా వైదిక మతం ఆదివాసీ, గిరిజన, జానపద సంస్కృతులను ధ్వంసం చేస్తోందనడానికి ఇదొక మంచి ఉదాహరణ! దీనికి మనువాదులు ప్రభావంలో కొట్టుకు పోయిన ప్రభుత్వాధినేతలే కారణం – సమ్మక్క సారక్కలు వీరవనితలన్నది జనం మరిచి పోయారు. వారి కోరికలు తీర్చే దేవతలయినట్టు భావిస్తు న్నారు. వారి సంస్కృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు కాకుండా, ఆనందోత్సహాలతో పండగ చేసుకుంటున్నారు.
ఇలాంటిదే మరొక విషయం చూద్దాం! తమిళనాడులోని ఇరళర్లే- తెలుగులో ఇరగాలోళ్లు అయ్యింది. వీరిది అడవిని ఆధారం చేసుకుని బతికే ఒక ప్రాచీన తెగ. నెల్లూరు ప్రాం తంలో వీరినే యానాదులు అని అంటున్నారు. వేటాడటం, పాములు పట్టడం వీరి వృత్తి. నెల్లూరు ఒక గ్రామంగా ఉన్న ప్పుడు అక్కడ అధిక సంఖ్యాకులైన ఇరగాలోళ్లు నెల్లూరు చెరు వుకి ఉత్తరం గట్టున నెలకొల్పనున్న గ్రామ దేవత – ఇరగా లమ్మ. కాలక్రమంలో వైదిక మతస్తుల ప్రభావంతో ఆ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మగా రూపాంతరం చెందింది. గోపు రం ధ్వజస్తంభం వెలసి, ధూప దీన నైవేద్యాలతో హిందూ దేవాలయమైపోయింది.
నెల్లూరి జిల్లా సుళ్ళూరిపేటలోని చెంగాలమ్మ గుడి కథ కూడా దాదాపు ఇలాంటిదే. యానాదులను కొన్ని ప్రాంతాల్లో చెంచోర్లు అని కూడా పిలిచేవారు. వారు నెలకొల్పుకున్న దేవత పేరు చెంచోరు లేదా చెంచోరమ్మ అని వ్యవహరించేవారు. ఆ పేరే కాలక్రమంలో చెంగాళమ్మ అయ్యింది. ప్రస్తుతం అమ్మ పేరు ‘తెన్‌ కాళి అమ్మ’గా మారిపోయింది. అక్కడ ఇరుకళల ప రమేశ్వరి అమ్మకు అమరిన హంగులన్నీ-ఇక్కడ తెన్‌కాళి అమ్మ కు కూడా అమిరాయి. శ్రీశైలం గుడి చెంచులదే- అన్న విష యం అందరికీ తెలిసిపోయింది. అయినా, ఇప్పుడు ఈ గుడు లేవీ చెంచులవి, యానాదులవి కావు. వైదిక మత ప్రభావంతో అవన్నీ ఆదివాసీ చేయి దాటిపోయాయి. అంతే కాదు ఒకప్పటి వాటి మూల సంస్కృతిని పోగొట్టుకున్నాయి.
ఇకపోతే, గోదావరి జిల్లాల్లోని నూకాలమ్మ ‘నూకాంబిక’ అయ్యింది. తెలంగాణ గ్రామాల్లోని ఎట్టమ్మ- ఎల్లమాంబా దేవి అయ్యింది. ఆదివాసీల జానపదుల గుళ్లన్నీ హిందూ దేవాల యాలుగా మన కండ్లముందే రూపాంతరం చెందుతూ వచ్చా యి. పోలేరమ్మ జాతర, పంబాలోల్ల వేడుకలు అన్ని మార్పున కు గురయ్యాయి. ఒక వైపు హైందవం, మరోవైపు క్రైస్తవం గిరి జనులు, దళితుల మూలల్ని ఒక పథకం ప్రకారం ధ్వంసం చే స్తూ వచ్చాయి. ఒకప్పుడు బౌద్ధ,జైన ఆలయాల్ని ధ్వంసం చేసి హిందూ దేవాలయాలుగా మార్చుకున్నట్టు- తర్వాతకాలంలో గిరిజన, ఆదివాసీ, దళిత, శూద్రజాతులు నెలకొల్పుకున్న దేవు ళ్లను, గుళ్లను హైందవం తీవ్రంగా దెబ్బతీసింది. ఆలయాల గో డలపై స్త్రీ పురుషుల నగశిల్పాల్ని చెక్కుకుని ఆలయాల్ని కామ కలాపాలకు వాడుకున్నది వైదికమతం. దేవదాసీ వ్యవస్థను ప్రోత్సహించి, బలవంతపు వ్యభిచారం నడిపించిన ఘనత సనాతనవాదులదే కదా? జనాన్ని బానిసత్వంలోకి తోసి, రక్త చరిత్ర సృష్టించిన చరిత్ర క్రైస్తవానిది. ఇప్పుడు ఆ మూలాల్ని, ఆ మూల సంస్కృతిని నిలుపుకోవడం మనవల్ల కాకపోవచ్చు. కానీ, సనాతనవాదుల అడ్డగోలు వాదనలు ఎదుర్కోవాలంటే, కనీసం మన మూలాల గూర్చి కొంతలోకొంతైనా తెలుసుకోవా లి కదా? గతం తెలుసుకున్న వారే భవిష్యత్తుకు దారులు వేయగలరు.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్ర వేత్త (మెల్బోర్న్‌నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు