సమోసా.. బిర్యానీ. .టీ

Samosa.. Biryani. .T– రేట్లు ఫిక్స్‌ చేసిన పోల్‌ ప్యానెల్‌లు
– ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రేట్లలో మార్పులు
న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు ప్రచారాలలో మునిగిపోతున్నాయి. మరోపక్క, ఎన్నికల సంఘం మాత్రం పార్టీలు, అభ్యర్థులు చేసి ఎన్నికల ఖర్చులపై దృష్టిని సారిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ఎన్నికల ఖర్చు కోసం సమోసాల నుంచి టీ వరకు పోల్‌ ప్యానెల్‌లు రేట్లను నిర్ణయిస్తున్నాయి. అయితే, ఇవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారుతూ ఉన్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌లోని అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికలలో బహిరంగ సభలు, ప్రచారాలలో భాగంగా ప్రజలకు అందించే ఒక కప్పు టీకి రూ. 15గా ఖర్చు చేయొచ్చు. సమోసాకూ అదే రేటు ఉన్నది. అయితే, మధ్యప్రదేశ్‌లోని మండలాలోని వారు ఒక కప్పు టీ కోసం రూ. 7, దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రధానమైన చిరుతిండిగా భావించే సమోసా కోసం రూ. 7.50 ఖర్చు చేయవచ్చు. 18వ లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ ప్రక్రియలో భాగంగా జిల్లా పోల్‌ ప్యానెల్‌లు ఖర్చుల రేట్లను నిర్ణయిస్తున్నాయి. అభ్యర్థులు తమ ఖర్చులను నిర్ణీత పరిమితిలోపు నిర్వహించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌తో సహా చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థి ఖర్చు పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించారు. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, సిక్కింలలో పరిమితి కాస్త తక్కువగా ఉన్నది. ఇక్కడ ఒక్కో అభ్యర్థికి రూ.75 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) కు, ఒక్కో అభ్యర్థికి ఒక్కో ప్రాంతాన్ని బట్టి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఖర్చు పరిమితి ఉంటుంది. జలంధర్‌లో చోలే భటుర్‌ రూ.40కి పరిమితం చేయగా, కిలో మటన్‌ రూ.500, చికెన్‌ రూ. 250గా ఉన్నాయి. గ్లాస్‌ లస్సీ రూ.20, గ్లాస్‌ షరబత్‌ రూ.15గా ఉన్నాయి. అలాగే, ధోధా కిలో రూ. 450), నెయ్యి పిన్ని కిలో రూ. 300గా నిర్ణయించబడ్డాయి.ఇక మధ్యప్రదేశ్‌లో ఈ రేట్లు చూస్తే.. రాష్ట్రంలోని బాలాఘాట్‌లో టీ ధర రూ. 5 మాత్రమే. అయితే, సమోసా ధర రూ. 10గా ఉన్నది. ఇడ్లీ, సాంబార్‌ వడ, పోహా-జలేబీ ధర రూ. 20 ఉన్నది. దోసె, ఉప్మా రూ.30గా నిర్ణయించారు.
మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖర్జూర, గజా (డెజర్ట్‌) ఒక్కోటి ధర రూ.10గా ఉన్నది. ఈశాన్య రాష్ట్రంలోని తెంగ్నౌపాల్‌ జిల్లాలోని అభ్యర్థులు బ్లాక్‌ టీకి రూ.5, మిల్క్‌ టీకి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. కిలో బాతు మాంసం రూ.300, పంది మాంసం రూ.400గా ఉన్నాయి. చికెన్‌ (బ్రాయిలర్‌), రోహు, మృగాల్‌, సారెంగ్‌ వంటి చేపలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.చెన్నైలో టీ రూ.10 నుంచి రూ.15కి, కాఫీ రూ.15 నుంచి రూ.20కి పెంచగా.. చికెన్‌ బిర్యానీ ప్యాకెట్‌ ధర 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కి తగ్గించారు. గౌతమ్‌ బుద్ధ నగర్‌ (గ్రేటర్‌ నోయిడా)లో శాకాహారం థాలీ రూ. 100, సమోసా, కప్పు టీ ఒక్కోటి రూ. 10, కచోరీ రూ. 15, శాండ్‌విచ్‌ రూ. 25, కిలో జిలేబీ రూ. కిలో రూ.90గా ధరలను నిర్ణయించారు. నార్త్‌ గోవా అభ్యర్థులు రూ. 15తో మెనూలో బటాటా వడను కలిగి ఉన్నారు. టీ రూ. 15కు, కాఫీ ధర రూ. 20కి పరిమితం చేశారు. హర్యానాలోని జింద్‌కు సంబంధించి అభ్యర్థులు దాల్‌ మఖ్నీ, మిక్స్‌ వెజ్‌ వంటి రుచికరమైన వంటకాలను రూ. 130కు పొందాల్సి ఉంటుంది. మటర్‌ పనీర్‌ ధర రూ. 160గా ఉన్నది.
పార్టీలు, అభ్యర్థులు తరచుగా కార్మికులు, ఓటర్లకు మద్యం అందిస్తున్నప్పటికీ.. రేట్‌ కార్డులలో ఏదీ మద్యం గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. హెలిప్యాడ్‌లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌస్‌లు వంటి ఖరీదైన మౌలిక సదుపాయాల నుంచి పూలు, కూలర్‌, టవర్‌ ఏసీలు, సోఫా వంటి ఇతర వస్తువుల వరకు రేట్‌ కార్డ్‌లలో ప్రస్తావించబడి ఉన్నాయి. రేట్‌ కార్డ్‌లు టాటా సఫారీ, స్కార్పియో నుంచి హౌండా సిటీ, సియాజ్‌ వరకు, ప్రజలను సమావేశాలకు తీసుకెళ్లటానికి అద్దెకు తీసుకునే వాహనాలకు కూడా రేట్ల పరిమితిని ఎన్నికల అధికారులు నిర్దేశించారు. కొన్ని పోల్‌ ప్యానెల్‌లు గులాబీ దండలు, బంతి పువ్వుల దండలు, పుష్పగుచ్ఛాలకూ రేట్లు నిర్ణయించాయి. మరికొన్ని పార్టీలకు సంబంధించిన టోపీలు, జెండాలు వంటి వాటికి సైతం రేట్‌ కార్డులలో చేర్చాయి.
ప్రస్తుతం, ఎన్నికల పోరులో వ్యక్తిగత అభ్యర్థులకు ప్రచార నిధులపై పరిమితి ఉన్నది. అయితే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసే డబ్బుపై పరిమితి లేదు. ఈసీఐ జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం కోసం గరిష్టంగా అనుమతించదగిన వ్యయం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మారుతూ ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 77 (1) ప్రకారం అభ్యర్థులు ”అతను నామినేట్‌ చేయబడిన తేదీ” నుంచి ”ఫలితాన్ని ప్రకటించే తేదీ” వరకు ఎన్నికలలో చేసిన ఖర్చుల ఖాతాను ఉంచాలి. భారత్‌లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న మొదటి దశలో 102తో ప్రారంభమయ్యే పోలింగ్‌ ఏడు దశల్లో జరుగుతుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నది. కాగా, ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు అనేక వ్యూహాలను పన్నుతున్నాయి. ప్రచారాల్లో లోతుగా నిమగమవుతున్నాయి.