సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు

Sanatana Dharma is being destroyed– ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు..
– మండిపడిన కాంగ్రెస్‌
భోపాల్‌ : అహంకారపూరితమైన ప్రతిపక్ష కూటమి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌ వంటి వారికి సనాతన ధర్మం స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పారిశ్రామిక ప్రాజెక్టులను గురువారం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ‘ఈ రోజు వారు బహిరంగంగా సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టారు. రేపు మనపై దాడులు పెంచుతారు. దేశంలోని సనాతనవాదులు, దేశాన్ని ప్రేమించే వారు జాగరూకతతో వ్యవహరించాలి’ అని ప్రజలను కోరారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ల కేటాయింపుల కంటే ఇది అధికమని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతి, నేరాలు తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. కాగా ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ప్రతిపక్షాలను దూషించడానికి ప్రభుత్వ కార్యక్రమాన్ని వాడుకున్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. జీఏ-ఎన్డీఏ (గౌతమ్‌ అదానీ ఎన్డీఏ)కు మోడీ నేతృత్వం వహిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు.