సనాతన ధర్మం అశాస్త్రీయం

Sanatana Dharma is unscientific– నల్లగొండ కేవీపీఎస్‌ సభలో స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
సనాతన ధర్మం ఆశాస్త్రీయమైనదని, రాజ్యాంగ ధర్మమే సర్వోన్నతమైనదని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌ బాబు అన్నారు. కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ‘సనాతన ధర్మమా.. రాజ్యాంగ ధర్మమా’ అనే అంశంపై సభ జరిగింది కేవీపీిఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ కేవీపీఎస్‌ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 2 నుండి 9 వరకు కేవీపీఎస్‌ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హిందు మతంలోనే కాదు, ముస్లిం, క్రిస్టియన్‌ మతంలో కూడా అంతరాలను పెంచి పోషిస్తున్న సనాతన భావాలు ఉన్నాయన్నారు. పాతకాలంలో సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకొచ్చి చితిలో వేసేవారని, బతికున్న భార్యను కూడా భర్త శవం పక్కన పెట్టి కాలబెట్టడం సనాతన ధర్మమా అని ప్రశ్నించారు. ఈ ధర్మాన్ని ఈ ఆధునిక యుగంలో కొనసాగిద్దాం అంటే అంగీకరిస్తారా.! అని ప్రశ్నించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని, అన్ని కులాల్లో బతుకుతున్న వారికి రాజ్యాంగం హక్కులను ప్రసాదించిందని ఇది రాజ్యాంగ ధర్మం గొప్పతనం తప్ప సనాతన ధర్మం గొప్పతనం ఏ మాత్రం కాదన్నారు. పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేవీపీఎస్‌ చేసిన పోరాటాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ గాదె లింగస్వామి, పందుల సైదులు, గంజి మురళీధర్‌, ఎడ్ల సైదులు, బండ శ్రీశైలం, సయ్యద్‌ హష్మీ, మానుపాటి భిక్షమయ్య, రాయల సీతారాములు, సిహెచ్‌.లక్ష్మీనారాయణ, మంజుల, సలీం, నరేష్‌, కొండేటి మురళి, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు రెమిడాల పరుశరాములు, జిట్టా నగేష్‌ గాదే నరసింహ, బొల్లు రవీందర్‌, కోడి రెక్క మల్లన్న, దైద శీను, ఒంటెపాక కృష్ణ, కొండ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.