సనాతనను నిర్మూలించాలి

– అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం: తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్‌
చెన్నై : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రొగ్రెస్సివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఆయన దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా వ్యాధులతో పోల్చారు. ”కొన్ని అంశాలను వ్యతిరేకించలేము, వాటిని నిర్మూలించాలి. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనాను వ్యతిరేకించం. మనం వాటిని నిర్మూలించాల్సి ఉంటుంది. అదే దారిలో, మనం సనాతన (సనాతన ధర్మం)ను వ్యతిరేకించటం కంటే నిర్మూలించాలి. సనాతన అనేది సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకం” అని ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు.
బీజేపీ అభ్యంతరం.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నన ఉదయనిధి
ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ వ్యతిరేకించింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్‌ హానికరమైన సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్‌ అమిత్‌ మాలవీయ.. ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అయితే, అమిత్‌ పోస్టుకు ఉదయనిధి స్టాలిన్‌ కోట్‌ చేస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను సనాతన ధర్మం వల్ల బాధను అనుభవించిన అణగారిన వర్గాల తరఫున మాట్లాడానని పేర్కొన్నారు. న్యాయపరంగానైనా, ప్రజా కోర్టులో నైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉదయనిధి స్టాలిన్‌ స్పష్టం చేశారు. అసత్య, నకిలీ వార్తల ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.