10 వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయండి

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులను అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో పది వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమాకర్‌ రడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, వ్యవస్థా పక అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత పదో న్నతి రాక మిగిలిన భాషాపండితులు, పీఈటీలకు పదోన్న తి కల్పించాలని తెలిపారు. బదిలీ అయి విడుదల కాని ఎస్జీటీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో వివిధ కారణాలతో బ్లాక్‌ చేయబడిన 13 జిల్లాల స్పౌజ్‌ ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. ఏడు జిల్లాల మోడల్‌ స్కూల్‌ టీచర్ల జూన్‌ వేతనం వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో పీఆర్టీయూ తెలంగాణ నాయకులు చంద్రశేఖర్‌ రావు, బాలాజీ, శ్రీనివాస్‌, రత్నాకర్‌ పాల్గొన్నారు.